Begin typing your search above and press return to search.

అర్నాబ్ అరెస్ట్ ,పత్రికా స్వేచ్ఛపై దాడి : మంత్రి జవడేకర్ !

By:  Tupaki Desk   |   4 Nov 2020 2:41 PM IST
అర్నాబ్ అరెస్ట్ ,పత్రికా స్వేచ్ఛపై దాడి : మంత్రి జవడేకర్ !
X
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల అన్వయ్ నాయక్ అనే ఇంటీరియర్ డిజైనర్ ‌‌ను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించారన్న కేసులో అర్నాబ్ ‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా డిజైనర్‌ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణలతో నమోదైన కేసును సాక్ష్యాలు లేవంటూ పోలీసులు దర్యాప్తును నిలిపివేశారు. అయితే రెండేళ్లనాటి కేసును తిరిగి ప్రారంభించాలన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తి నేపథ్యంలో అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్‌, సాయుధులైన పోలీసులతో అర్నాబ్‌ను నిర్బంధించారని రిపబ్లిక్‌ టీవీ ఆరోపించింది.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. అర్నాబ్ అరెస్టును ఖండించిన జవదేకర్.. ఇది ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను గుర్తు చేస్తోందన్నారు. ‘మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిని మేం ఖండిస్తున్నాం. మీడియాతో ఇలా వ్యవహరించడం సరికాదు. ఇది ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేస్తోంది’ అని జవదేకర్ ట్వీట్ చేశారు.

కాగా, పోలీసులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అన్వయ్ రాసిన సూసైడ్ నోట్‌‌లో అర్నాబ్ గోస్వామి సహా మరో ఇద్దరు వ్యక్తులు తనకు రావాల్సిన రూ.5 కోట్ల 40 లక్షలు చెల్లించలేదని తెలిపాడు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, అందుకే తాను సూసైడ్ చేసుకున్నట్లు లేఖలో అన్వయ్ నాయక్ పేర్కొన్నారు.