Begin typing your search above and press return to search.

కోర్టు తీర్పుతో యుద్ధానికి తెర.. మాన్సాస్ లో ఇప్పుడేం జరగనుంది?

By:  Tupaki Desk   |   12 Aug 2021 9:00 PM IST
కోర్టు తీర్పుతో యుద్ధానికి తెర.. మాన్సాస్ లో ఇప్పుడేం జరగనుంది?
X
అన్నింటిలోనూ అధిక్యత సాధ్యం కాదు. కొన్ని విషయాల్ని పట్టించుకునే కన్నా.. పట్టించుకోనట్లుగా ఉండటానికి మించిన మంచి పని మరొకటి ఉండదు. చేతిలో ఎంత అధికారం ఉన్నప్పటికి.. అన్ని తాము అనుకున్నట్లే జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకేమాత్రం సంబంధం లేని మాన్సాస్ వ్యవహారంలో వేలు పెట్టటమే కాదు.. సమర్థత లేని సంచయిత లాంటి వారిని చేరదీయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పాలి.

మాన్సాస్ ట్రస్టు వారసత్వ బాధ్యతల విషయంలో జరుగుతున్న యుద్ధానికి తాజాగా హైకోర్టు పుల్ స్టాప్ పెట్టటమే కాదు.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ కూడా సమర్థించటంతో.. ట్రస్టు ఛైర్మన్ గా మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు కంటిన్యూ కానున్నారు. ఈ తీర్పుతో సంచయితతో పాటు.. ఆమెకు నైతిక మద్దతు ఇచ్చిన వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లుగా చెప్పక తప్పదు. అశోక్ గజపతికి బదులుగా మరొకరిని మాన్సాస్ కుర్చీ మీద కూర్చోబెట్టాలంటే అందుకు జరగాల్సిన హోంవర్కు చాలానే ఉందన్నది మర్చిపోలేరు.

సమకాలీన రాజకీయాలకు భిన్నమైన మైండ్ సెట్ ఉన్న అశోక్ గజపతి రాజు అంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన్ను అభిమానిస్తారు. గౌరవిస్తుంటారు. అలాంటి అందుకు భిన్నంగా వ్యవహరించటం ద్వారా సంచయిత తనకొచ్చిన చక్కటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారని చెప్పాలి. సంచయితను నమ్ముకున్నందుకు వైస్సార్సీపీ ప్రభుత్వం ఈ రోజున విమర్శలకు గురి కావాల్సిన పరిస్థితి.

దీనికి తగ్గట్లే.. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటుందన్న విమర్శ ఆయన నోటి నుంచి వచ్చింది. ఏపీ సర్కారుపై విమర్శలతో పాటు.. వారి మద్దతుతో తెర మీదకు వచ్చిన సంచయితకు చురకలు అంటించారు. సంచయిత చేసింది తక్కువ.. హడావుడి ఎక్కువన్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈవో వచ్చి తనను కలిసింది లేదన్న మాట చెప్పటం చూస్తే.. రానున్న రోజుల్లో ఈవో తగిన మూల్యం చెల్లించేలా అశోక్ గజపతి ప్లానింగ్ ఉంటుందని చెబుతున్నారు.

మాన్సాస్ వారసత్వం మీద గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎందుకింత రచ్చ అంటే.. దానికి ఉన్న ఆస్తి పాస్తులేనని చెప్పాలి. ఈ ట్రస్టు పరిధిలో దాదాపు 12 విద్యా సంస్థలు.. 1800 మంది ఉద్యోగులు.. 15వేల మంది విద్యార్థులే కాదు.. దాదాపు 14,800 ఎకరాల భూమి ఉంది. వీటితో పాటు 108 దేవాలయాలు.. వాటి భూములు కూడా ఈ ట్రస్టు పరిధిలోనే ఉన్నాయి.

ఈ ట్రస్టు ఏర్పాటైన నాటి నుంచి గజపతుల వంశస్తులే దీనికి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 1958లో ఏర్పాటు చేసిన ఈ ట్రస్టుకు వ్యవస్థాపక ఛైర్మన్ గా పీవీజీ రాజు.. ట్రస్టు బోర్డు సభ్యులుగా అశోక్ గజపతి రాజులు ఉండేవారు. 1994లో పీవీజీ రాజు మరణించిన తర్వాత ఆనంద గజపతి రాజు ఛైర్మన్ గా ఉన్నారు. 2016లో ఆయన మరణించాక అశోక్ గజపతి రాజు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

అయితే..జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ గజపతి రాజును తొలగించి ఆయన స్థానంలో ఆనంద గజపతి రాజు కుమర్తె సంచయితను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కోర్టులో న్యాయపోరాటం జరగటం.. తాజాగా అశోక్ గజపతి రాజుకు అనుకూలంగా తీర్పు రావటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో రాంగ్ చాయిస్ ఎంపిక చేసుకోవటమే జగన్ సర్కారుకు తలనొప్పిగా మారిందన్న మాట వినిపిస్తోంది.