Begin typing your search above and press return to search.

అప్పుడు తిట్లకు ఇప్పుడు సారీలు చెప్పటమేమిటి?

By:  Tupaki Desk   |   14 Jan 2016 3:54 PM GMT
అప్పుడు తిట్లకు ఇప్పుడు సారీలు చెప్పటమేమిటి?
X
గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని సెటిలర్ల మీద విపరీతమైన ప్రేమాభిమానాలు పొంగిపొర్లిస్తున్నారు రాజకీయ నేతలు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెటిలర్ల ప్రయోజనాల గురించి గళం ఎత్తని పార్టీలకు భిన్నంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెటిలర్ల మీద ప్రేమాభిమానాలు పొంగిస్తున్నారు. సెటిలర్లను ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అనేసిన టీఆర్ఎస్ నేతలు సైతం.. ఇప్పుడు సెటిలర్లను సొంతబిడ్డలు మాదిరి చెబుతున్న మాటలు చూస్తుంటే వాటి ప్రత్యర్థి పార్టీలకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి.

తెలంగాణ ఉద్యమ సమయంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి ఇప్పుడేమో.. టీఆర్ఎస్ నేతలు సెటిలర్ల మనసు దోచుకునేలా మాట్లాడటంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లాంటి వారు అయితే.. తాను కూడా సెటిలర్ అంటూ చెప్పేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెటిలర్ల మనసుల్ని దోచుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా గళం విప్పుతున్నారు.

తాజాగా ఆ జాబితాలో చేరారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. తాజాగా ఆమె.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో సెటిలర్లను దూషించినందుకు.. ఇప్పుడు సారీలు చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ.. కేసీఆర్ తిట్టి తప్పు చేశారని అనుకుంటే.. ఆ రోజున కామ్ గా ఉండి.. ఈ రోజు సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న రేణుక చౌదరిని ఏమనాలి? అన్నేసి మాటలు అనేస్తున్న వేళ ఆమె లాంటి వారు మౌనంగా ఉండటాన్ని ఏలా అర్థం చేసుకోవాలి..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను క్షమాపణులు చెప్పాలని డిమాండ్ చేసే ముందు.. తాము చేసిన ఘనకార్యం మీద కూడా వివరణ ఇస్తే బాగుంటుంది కదూ.