Begin typing your search above and press return to search.

రేణుకా చౌదరి రివర్స్ అటాక్

By:  Tupaki Desk   |   14 Feb 2019 11:18 AM GMT
రేణుకా చౌదరి రివర్స్ అటాక్
X
మొన్నటి టీఆరెస్ సుడిగాలిని తట్టుకుని కాంగ్రెస్ బతికిబట్టకట్టిన జిల్లా ఖమ్మం ఒక్కటే. కానీ, అక్కడా పార్టీలో ముదిరిపోతున్న రాజకీయాలు నష్టం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ రేణుకా చౌదరికి పొగపెట్టేందుకు కొందరు సీనియర్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తోంది. దీంతో రేణుక రివర్స్ గేర్‌ లో అటాక్ చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తనకు కనుక ఖమ్మం లోక్ సభ టికెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాలను టీఆరెస్ చుట్టబెట్టేయగా ఖమ్మంలో మాత్రం ఒక్క సీటుకే పరిమితం అయింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది కూడా ఖమ్మం జిల్లాలోనే. దీంతో వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఖమ్మం లోక్ సభ నుంచి పోటీ చేయాలంటూ ఆ పార్టీ నేతలు పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు ఆయన్ను స్వయంగా ఆహ్వానించారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్‌ లో ఓడిపోయిన రేవంత్ రెడ్డిని ఖమ్మం నుంచి పోటీ చేయించాలన్న ప్రయత్నాలూ జరుగుతున్నాయి.

అయితే.. ఇవన్నీ రేణుక చౌదరి అవకాశాలను దెబ్బతీసే క్రమంలోనే జరుగుతున్నాయని సమాచారం. ఆమె ఉండగా తాము టికెట్ సాధించుకోలేం కాబట్టి ఆమెను కాకుండా తొలుత ఇతరులకు టికెట్ ఇప్పిస్తే ఆ తరువాత కథ ఆ తరువాత మొదలుపెట్టొచ్చన్న వ్యూహంతో ఈ రాజకీయాలు సాగుతన్నాయట.

కానీ, అసలే ఫైర్ బ్రాండ్‌ గా పేరున్న రేణుకా చౌదరి దీనికి రివర్స్ కౌంటర్ వేశారు. తనకు కనుక టికెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారు. అసలే అధిష్ఠానం వద్ద పట్టున్న నేత కావడంతో ఆమె ఆగ్రహిస్తే తమకే ఇబ్బందని ఖమ్మం నేతలు ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారట.