Begin typing your search above and press return to search.

వైసీపీ ప్రభుత్వానికి కేవీపీ, ఉండవల్లి అవసరం గుర్తుకు వచ్చిందా?

By:  Tupaki Desk   |   1 Jun 2020 8:10 AM GMT
వైసీపీ ప్రభుత్వానికి కేవీపీ, ఉండవల్లి అవసరం గుర్తుకు వచ్చిందా?
X
రాజకీయంగా తిరుగులేని విధంగా మారాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్లాన్లు వేస్తున్నట్టు పరిణామాలు సాగుతున్నాయి. రాజకీయాల్లో తిరుగులేని వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన పాత కాపులను తిరిగి తన దరికి చేర్చుకోవాలని జగన్ యోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మ అయిన కేవీపీని.. మరియు వైసీపీకి మంచి సలహాలు ఇచ్చే టీం లో ఉండవల్లి అరుణ్ కుమార్ ను దరికి చేర్చుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అలాంటి దిగ్గజ నేతల అవసరం ఉంది అని వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు వైసీపీ సోషల్ మీడియా టీం.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి సీఎం అయ్యారు. ఆరోజు వైఎస్ఆర్ కి పరిపాలన అనుభవం లేకున్నా ఒక మంచి సలహాలు ఇచ్చే టీంను ఏర్పాటు చేసుకున్నారు. కేవీపీ, ఉండవల్లి, రోశయ్య, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక టీం ఏర్పాటు చేసుకొని మంచి సలహాలతో సంక్షేమ పథకాలు పెద్దఎత్తున ప్రకటించి సక్సెస్ ఫుల్ సీఎం అనిపించుకొని మళ్లీ రెండో విడత ఒంటిచేత్తో పార్టీని గెలిపించుకున్నాడు.

ఆరోజు ఇదే చంద్రబాబు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ మీద అవినీతి పుస్తకాలు కొట్టించి.. కోర్టులో కేసులు వేసినా.. జనాలు చంద్రబాబును పట్టించుకోకుండా 2009లో టీడీపీ+టీఆర్ఎస్+కమ్యూనిస్టులు ఏకమైనా సింగిల్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బరిలోకి దిగి సింహంలా కాంగ్రెస్ ను గెలిపించాడు.

ఆ తర్వాత వైఎస్ఆర్ మరణం.. జగన్ పార్టీ పెట్టడం.. తొలిసారి 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత రెండోసారి ఎన్నికలకు ముందు సుధీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత 51శాతం ఓట్లతో ఏకంగా 151 సీట్లు సాధించి గెలిచారు. ఇప్పుడు గెలిచాక ఏడాదిలో పెద్ద ఎత్తున ప్రభుత్వంలో డబ్బులు లేకున్నా ఎవరూ చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే కొన్ని గొప్ప పథకాలు.. నిర్ణయాల్లో జీవోలు ఫెయిల్ అయ్యి.. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తింటున్నారు. దీనిపై ఆలోచించగా.. అంతమంచి సలహాదారులు, మంచి ఆఫీసర్స్ టీం లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. అందుకే ప్రభుత్వానికి ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఏపీ సీఎం జగన్ కు రిక్వెస్ట్ లు పెడుతున్నారు.