Begin typing your search above and press return to search.

ప్రభుత్వాల మధ్య పోరును.. ప్రజలకు ముడులేసుడేంది జగదీశా?

By:  Tupaki Desk   |   16 July 2021 6:30 AM GMT
ప్రభుత్వాల మధ్య పోరును.. ప్రజలకు ముడులేసుడేంది జగదీశా?
X
అవును.. మారిన రాజకీయాల్లో నేతల నోటి నుంచి వచ్చే మాటల్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాలో? ఎంత వరకు స్పోర్టివ్ గా తీసుకోవాలన్న దానిపై లెక్కలు చాలానే ఉంటున్నాయి. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పాటుపడతాయన్నదే నిజమైతే.. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల జట్లకు ముడి వేసేలా వివాదాలు తలెత్తాలని ఎవరూ కోరుకోవటం లేదు కదా? ఆ మాటకు వస్తే..జనాలకు లేని రంది నేతలకు.. ప్రభుత్వాలకు ఉండటం.. తమ రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా భావోద్వేగాల్ని రగల్చటం ఈ మధ్యన ఎక్కువైంది. సున్నిత అంశాల్లోకి ప్రజల్ని తీసుకొచ్చే పాడు అలవాటును నేతలు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

అది ఆంధ్రా అయినా.. తెలంగాణ అయినా.. తెలుగు ప్రజలంతా ఒక్కటే. విడిపోయి కలిసి ఉందామని కమిట్ కావటమే కాదు.. ఏడేళ్ల కాలంలో అందుకు తగ్గట్లే వారున్నారన్నది మర్చిపోకూడదు. రెండు రాష్ట్రాల మధ్య.. ప్రజల మధ్య సంబంధాలు దరిద్రపుగొట్టు రాజకీయాల కారణంగా విభజన రేఖ ఏర్పడటం ఎవరికి మంచిది కాదు. ఒకవేళ.. అలాంటి ప్రయత్నం చేసే వారిని నిలువరించటం.. వారిని పక్కన పెట్టటం... హెచ్చరించటం తప్పనిసరి.

ఈ మధ్యనే తెలంగాణ మంత్రి ఒకరు జల వివాదం విషయంలో రాక్షసడన్న మాటను చనిపోయిన వ్యక్తికి ఆపాదించటంతో పాటు.. ప్రజల మనోభావాల్ని గాయపరిచేలా మాట్లాడారు. ఆ వెంటనే తెలంగాణ ప్రజల్లోనే ఆగ్రహం వ్యక్తమైంది.మీ రాజకీయం కోసం మా మధ్య చిచ్చు పెడతారెందుకు? అంటూ ప్రశ్నలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. దీంతో.. విషయం అర్థం చేసుకున్న మంత్రిగారు.. తాను అన్నది ఆంధ్రా ప్రజల్ని కాదని.. ఆంధ్రా ప్రాంత నాయకులనంటూ తన మాటకు కొత్త అర్థాన్ని చెప్పి.. వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

తాజాగా మరో తెలంగాణ మంత్రి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఆయన తీరును ప్రాంతాలకు అతీతంగా.. రాష్ట్రాలకు సంబంధం లేకుండా అందరూ తప్పు పడుతున్న పరిస్థితి. కృష్ణా జలాలపై కొట్టాడే పరిస్థితి తెచ్చింది ఏపీ సర్కారేనని.. జల వివాదాలతో పాటు ఆస్తి.. ఉద్యోగుల పంపకాలపై కిరికిరి పెడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే.. వివాదం తలెత్తినప్పుడు మాట్లాడే కన్నా.. అన్ని సందర్భాల్లోనూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల గురించి సున్నితమైన భాషలో ప్రస్తావించొచ్చు కదా? అన్న ప్రశ్న పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రా సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ఆకతాయి పిల్లాడిలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహ హస్తం చాచినా చేతగానితనంతో కోర్టు మెట్లు ఎక్కారని ఆరోపించారు. జల వివాదానికి కారణమైన జీవో 203ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పులిచింతల నీటిని వృథా చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న ఆయన.. తెలంగాణ ప్రజల రక్తంలో చెడు చేసే ఆలోచన ఉండదని వ్యాఖ్యానించారు.

రెండు ప్రభుత్వాల మధ్య చోటు చేసుకునే వివాదాల విషయంలో ప్రభుత్వాలు పరిష్కరించుకోవాలే కానీ.. ప్రజల్ని లాగటం.. వారిపై భావోద్వేగ వ్యాఖ్యలు చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది. జగన్ పాలనకు విసుగు చెందిన ఏపీ ప్రజలు.. సీఎం కేసీఆర్ ఆంధ్రాలో పుట్టి ఉంటే బాగుండేదని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాల్లో భాగంగా నేతలు.. ఒకరిపై ఒకరిని అనుకోవటం మంచిదే. కానీ.. ఈ వివాదాలతో సంబంధం లేని ప్రజలను లాగటం పైనే పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.