Begin typing your search above and press return to search.

కరోనా వేళ ఆక్సీజన్ సిలిండర్ల దందా... !

By:  Tupaki Desk   |   28 April 2021 8:30 AM GMT
కరోనా వేళ ఆక్సీజన్ సిలిండర్ల దందా... !
X
కరోనా వైరస్ మహమ్మారి కేసులు ఇటీవల దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తుతుండడంతో వారికి ఆక్సీజన్ అందించాల్సి వస్తోంది. మొదటి వేవ్ లో ఈ పరిస్థితి అంతగా లేనప్పటికీ , ఈ సెకండ్ వేవ్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్లకు గిరాకీ బాగా పెరిగింది. దీనితో కొందరు అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఆక్సీజన్ సిలిండర్ల దందాకు తెరలేపారు. కొన్ని చోట్ల ఆక్సిజన్‌ అందక కరోనా బాధితుల ప్రాణాలు పోతుంటే, అవేమీ పట్టించుకోకుండా వీరు ఆక్సిజన్‌ సిలిండర్ల దందా జరుపుతుండడం గమనార్హం. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ రూ.లక్షలు దండుకుంటున్న ముఠా ఆటలకి రాచకొండ ఎస్‌ఓటీ, మల్కాజిగిరి పోలీసులు చెక్‌ పెట్టారు.

సీపీ కథనం ప్రకారం వివరాలు.. కంచన్‌ బాగ్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఆసిఫ్‌ మాస్‌ ఫౌండేషన్‌ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు. కరోనా బాధితులుకు ఆక్సిజన్‌ సిలిండర్లు, అంబులెన్సు సేవలు ఉచితంగా అందిస్తామంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ స్వచ్ఛంద సంస్థ ముసుగులో సల్మాన్‌ అనే వ్యక్తి నుంచి 150 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్‌ ను రూ.16 వేలకు కొనుగోలు చేసి , ఆ తర్వాత దాన్ని బ్లాక్ మార్కెట్ కి తరలించి కరోనా పేషెంట్లకు రూ.25 వేలకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై రాచకొండ ఎస్‌ ఓటీ పోలీసులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఆక్సిజన్‌ సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్న వాహనం మౌలాలీ మీదుగా ఈసీఐఎల్‌ వైపు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు.

మల్కాజిగిరి పోలీసుల సహకారంతో రాత్రి 10 గంటలకు జెడ్‌ టీఎస్‌ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. వీరికి మాస్‌ ఫౌండేషన్‌ అంటూ రాసి ఉన్న ఓమ్నీ వాహనం ఒకటి కనిపించింది. అనుమానంతో తనిఖీ చేయగా అందులో 150 లీటర్ల 5 ఆక్సిజన్‌ సిలిండర్లు బయటపడ్డాయి. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు వాహనంలో లభించలేదు. ఓమిని వ్యాన్‌ డ్రైవర్‌ సయ్యద్‌ అబ్దుల్లాతో పాటు వాహనంలోని మహ్మద్‌ మజార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఫలితంగా ఆసిఫ్‌ చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆక్సిజన్‌ సిలిండర్లు, వాహనాన్ని, సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లిండర్ల దందా వెలుగు చూడడంతో నగరంలో ఈ రకం అక్రమాలపై మరింతగా దృష్టిపెడతామని పోలీసులు చెప్పారు. అనుమతులు లేకుండా ప్రాణవాయు సిలిండర్లు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.