Begin typing your search above and press return to search.

సరిహద్దుల్లోని సైనికులకు పెద్ద రిలీఫ్

By:  Tupaki Desk   |   1 Aug 2022 10:30 AM IST
సరిహద్దుల్లోని సైనికులకు పెద్ద రిలీఫ్
X
దేశ సరిహద్దుల్లో కాపలాకాస్తున్న సైనికులకు పెద్ద రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. ప్రపంచంలోనే రెండో అత్యంత చల్లని ప్రాంతంగా లడ్దాఖ్ లోని ద్రాస్ ప్రాంతంగా రికార్డుల్లో ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా అత్యంత చల్లగా ఉంటుంది. చలికాలం, వర్షాకాలంలో అయితే దాదాపు మైనస్ 30 డిగ్రీల్లో ఉంటుంది చలి. ఇక్కడ ఎంతచల్లగా ఉంటుందంటే వేడినీళ్ళు పంపుల్లో నుండి బక్కెట్లో పడిన వెంటనే వాడుకోకపోతే మళ్ళీ గడ్డకట్టిపోతాయట.

అంతటి చలిప్రాంతంలో మన సైనికులు 24 గంటలూ 365 రోజులు కాపలా కాస్తునే ఉంటారు. మైనస్ 30 డిగ్రీల చలిలో కాపలా కాయటమంటే మామూలు విషయంకాదు. ఇలాంటి సైనికులకు వెచ్చదనం కల్పించటం కోసమే ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నాయకత్వంలో ఒక భవనం నిర్మితమైంది.

అదికూడా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ, డిజైన్ తో నిర్మితమవ్వటం గమనార్హం. కార్గిల్ కొండల్లో 10,800 అడుగుల ఎత్తున పదిమంది సైనికులు పడుకోవటానికి వీలైనంత విశాలంగా కొత్త భవనాన్ని నిర్మించారు.

ఈ భవనంలో వాడిన టెక్నాలజీ కారణంగా ఏడాదిపొడవునా వెచ్చగానే ఉంటుంది. పంట వ్యర్ధాలు, లడ్డాఖ్ మట్టి కలిపి తయారుచేసిన ఇటుకలను భవనం నిర్మాణంలో ఉపయోగించారు. నాగ్ పూర్ కేంద్రంగా పనిచేస్తున్న లోక్ మత్ ఫౌండేషన్ ఈ భవనాన్ని నిర్మించింది. అత్యంత చలిప్రాంతాల్లో కాపలాకాసే సైనికుల్లో విశ్రాంతి తీసుకునే వారికోసం ఈ కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది.

ప్రయోగాత్మకంగా తయారైన ఈ భవనం ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరిన్ని భవనాలను నిర్మించాలని లోక్ మత్ ఫౌండేషన్ డిసైడ్ అయ్యింది. నిజానికి ఇలాంటి భవనాలు ఎన్నింటిని నిర్మించినా సైనికులకు ఏమాత్రం సరిపోవన్నది వాస్తవం.

ఎందుకంటే సరిహద్దురేఖ పొడవునా కొన్నివేలమంది సైనికులు 24 గంటలూ కాపలాకాస్తుంటారు. కాకపోతే ఇన్నివేలమంది సైనికులకు ఇలాంటి భవనాలను అందులోను పర్వతప్రాంతాల్లో నిర్మించటమంటే కూడా కష్టమే. కాకపోతే అవకాశమున్నంతలో మరిన్ని భవనాలను నిర్మించేందుకు ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది.