Begin typing your search above and press return to search.

స‌హాయ‌క కేంద్రంలో వారి పెళ్లి చేశారు!

By:  Tupaki Desk   |   20 Aug 2018 5:08 AM GMT
స‌హాయ‌క కేంద్రంలో వారి పెళ్లి చేశారు!
X
ఓవైపు దారుణంగా విరుచుకుపడుతున్న వ‌ర్షాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేర‌ళ‌లో ల‌క్ష‌లాది మంది ఇప్పుడు స‌హాయ‌క కేంద్రాల్లో త‌ల దాచుకుంటున్నారు. ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కావ‌టం.. ర‌వాణా సౌక‌ర్యాలు పూర్తిగా బంద్ కావ‌టంతో.. బాధితుల్ని పెద్ద ఎత్తున స‌హాయ‌క కేంద్రాల‌కు త‌ర‌లించారు. అలాంటి స‌హాయ‌క కేంద్రంలో అనుకోని ఘ‌ట‌న జ‌రిగింది.

కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌ర‌గాల్సిన వివాహ వేడుకను భారీ వ‌ర్షాల కార‌ణంగా వాయిదా వేసుకోవాల‌ని భావిస్తే.. అరే.. పెళ్లిని ఎందుకు వాయిదా వేసుకోవాలి. అనుకున్న ముహుర్తానికి పెళ్లి చేసుకుంటే స‌రి అన్న మాట‌ను స‌హాయ‌క శిబిరంలోని వారు చెప్ప‌టం.. త‌లో ప‌ని చేసి వారి పెళ్లిని జ‌రిపించేందుకు ముందుకు రావ‌టంతో ఒక జంట పెళ్లి జ‌రిగింది. ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ ఉదంతంలోకి వెళితే..

కేర‌ళ‌లోని మ‌ళ‌ప్పురానికి చెందిన అంజుకు.. సైజు అనే యువ‌తితో పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. గ‌తంలోనే వీరిద్ద‌రి పెళ్లి ఫిక్స్ అయ్యింది. స‌రిగ్గా పెళ్లి ముహుర్తం అనుకున్న వేళ‌కు.. వ‌ర‌ద‌లు వారి ఊరిని ముంచెత్త‌టంతో వారిని అధికారులు స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించారు. వారి శిబిరంగా స్కూల్ మారింది.

అయితే.. వీరి పెళ్లి విష‌యాన్ని తెలుసుకున్న శిబిరంలోని వారు.. అనుకున్న ముహుర్తానికి పెళ్లి చేసుకోవాల‌ని ప్రోత్స‌హించారు. ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉన్న వేళ‌.. పెళ్లి త‌ర్వాత చేసుకుందామ‌ని ఈ జంట భావించినా.. అలాంటిదేమీ అవ‌స‌రం లేదంటూ.. శిబిరంలోని వారు ముందుకు వ‌చ్చి స్వ‌యంగా వారి పెళ్లి కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయ‌టం విశేషం. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. వీరి పెళ్లి జ‌ర‌గాల్సిన ఆల‌యానికి ట్ర‌స్టీగా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తి వీరి పెళ్లి విందుకు ఏర్పాట్లు చేయ‌టానికి ముందుకు వ‌చ్చారు. మ‌ళ‌ప్ఫురం జిల్లాలోని మ‌రో రెండు చోట్ల కూడా ఇదే త‌ర‌హాలో పెళ్లిళ్లు జ‌ర‌గ‌టం గ‌మ‌నార్హం. క‌ష్టంలో ఉన్నాం కాబ‌ట్టి కుంగిపోవాల్సిన అవ‌స‌రం లేదు. కొత్త జీవితాన్ని క‌ష్టంలోనూ స్టార్ట్ చేయొచ్చ‌ని నిరూపించారు కేర‌ళీయులు.