Begin typing your search above and press return to search.

కరోనా వేళలోనూ రిలయన్స్ ఎంతలా అదరగొట్టేస్తుందంటే?

By:  Tupaki Desk   |   31 July 2020 11:00 AM IST
కరోనా వేళలోనూ రిలయన్స్ ఎంతలా అదరగొట్టేస్తుందంటే?
X
యావత్ ప్రపంచం కరోనా సంక్షోభంలో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళలో.. అందుకు భిన్నంగా రికార్డుల మీద రికార్డులే కాదు.. కాలంతో పని లేకుండా తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇటీవల కాలంలో పదే పదే పాజిటివ్ వార్తల్లోకి వస్తున్న రిలయన్స్.. మరోసారి ఇరగదీసిందని చెప్పాలి. ఏప్రిల్ -జూన్ త్రైమాసానికి సంబంధించిన ఫలితాల్ని తాజాగా వెల్లడించింది.

అందరి అంచనాలకు భిన్నంగా తన ఫలితాల్ని ప్రకటించి.. ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా కారణంగా రిఫైనింగ్.. పెట్రో కెమికల్స్.. రిటైల్ వ్యాపారాల మీద ప్రభావం పడినప్పటికి.. వాటాల్ని విక్రయించటం.. జియో టెలికాం సాధించిన ఆదాయంతో రికార్డుస్థాయిలో లాభార్జనను సొంతం చేసుకుంది. తాజాగా తన నికర లాభాల్ని రూ.13,248 కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.10,141 కోట్ల కంటే దాదాపు మూడు వేల కోట్లకు పైనే అధికం కావటం గమనార్హం.

తన వాటాల్ని విక్రయించిన ద్వారా రూ.1.52లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఆర్ ఐఎల్.. ఇంధన విక్రయ వ్యాపారంలో 49 శాతం వాటాను అమ్మటం ద్వారా రూ.7629 కోట్లకు విక్రయించింది. కరోనా నేపథ్యంలో చమురు రిఫైనింగ్ విభాగంలో ఆదాయం తీవ్ర ప్రభావానికి లోనైనా.. అదేమీ రిలయన్స్ మీద పడకపోవటం ఆసక్తికరంగా చెప్పాలి. గత ఏడాది బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చటం ద్వారా 8.9 డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తే.. ఈ ఏడాది కేవలం 6.3 డాలర్లను మాత్రమే సంపాదించింది. అయినప్పటికీ.. వాటాల్ని వినియోగించటంలో వ్యవహరించిన నేర్పు.. రిలయన్స్ కు అధిక ఆదాయాన్నే కాదు.. నికర లాభాన్ని పెంచేలా చేసిందని చెప్పక తప్పదు. అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని తిరిగే ముకేశ్ అంబానీ లాంటోళ్లకు కరోనా లాంటి పరిస్థితుల్లోనూ తిరుగులేని రీతిలో వ్యవహరించటం విశేషమే.