Begin typing your search above and press return to search.

ప్ర‌ధానీ ప‌క్క‌న కూర్చునేందుకు అంబానీ అంత ఖ‌ర్చు చేశార‌ట‌!

By:  Tupaki Desk   |   17 May 2019 11:24 AM IST
ప్ర‌ధానీ ప‌క్క‌న కూర్చునేందుకు అంబానీ అంత ఖ‌ర్చు చేశార‌ట‌!
X
రూ.9 కోట్లు.. ఈ రోజున‌ చాలా చిన్న మొత్తం. అయితే.. అది మీకూ.. మాకు కాదు. అంబానీలాంటి పెద్ద వ్యాపార‌వేత్త‌కు. కానీ.. అదే అంబానీ 1987లో అంత మొత్తం చెల్లించ‌ట‌మంటే మాట‌లు కాదు. ఈ రోజున రిల‌య‌న్స్ నాటి ప‌రిస్థితి నాడు లేద‌నే చెప్పాలి. అలా అని.. అప్పుడేమీ చిన్న కంపెనీ అని మేం చెప్ప‌ట్లేదు. దాదాపు 32 ఏళ్ల క్రితం రూ.9 కోట్ల మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌టం అంటే మామూలు కాదు. కానీ.. అంత మొత్తాన్ని రిల‌య‌న్స్ అంబానీ ఎందుకు ఖ‌ర్చు చేశారో తెలుసా?.. కేవ‌లం నాటి ప్ర‌ధాని రాజీవ్ గాంధీ ప‌క్క‌న కూర్చునేందుకు.

ప్ర‌ధాని ప‌క్క‌న కూర్చోవ‌టం ఏమిటి? ఇంత‌కీ ఎక్క‌డ కూర్చోవ‌టం.. అందుకు రూ.9కోట్లు అంబానీ ఎందుకు ఖ‌ర్చు చేశార‌న్న వివ‌రాల్లోకి వెళితే.. ఇవాల్టి రోజున ప్ర‌పంచ క్రికెట్ గురించి మాట్లాడిన‌ప్పుడు.. ఇండియా ప్ర‌స్తావ‌న రాకుండా ఉండ‌టం సాధ్యం కాదు. అయితే.. మొద‌టి మూడు ప్ర‌పంచ క‌ప్ టోర్నీల‌ను ఇంగ్లండ్ లోనే నిర్వ‌హించారు. దాన్ని ఆసియా ఖండంలోకి త‌ర‌లించాల‌న్న ఆలోచ‌న చేసినా.. ప్రాక్టిక‌ల్ గా వ‌ర్క్ వుట్ కాని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. 1987లో భార‌త్.. పాకిస్తాన్ సంయుక్తంగా రిల‌య‌న్స్ వ‌రల్డ్ క‌ప్ కు అతిథ్య‌మివ్వ‌టం గుర్తుండే ఉంటుంది.

చాలామందికి రిల‌య‌న్స్ వ‌రల్డ్ క‌ప్ గుర్తున్నా.. అది జ‌ర‌గటానికి కార‌ణాలు పెద్ద‌గా తెలీవు. కానీ.. ఈ టోర్నీ నిర్వ‌హ‌ణ కోసం రిల‌య‌న్స్ అధినేత అంబానీ చేసిన ఆస‌క్తిక‌ర ప్ర‌తిపాద‌న చాలా త‌క్కువ మందికే తెలుసు. రెండు దేశాల మ‌ధ్య నిర్వ‌హించే క్రికెట్ టోర్నీ విష‌య‌మై పారిశ్రామిక‌.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చాలానే చ‌ర్చ జ‌రిగింది. టోర్నీ నిర్వ‌హించ‌టానికి ప్ర‌భుత్వం కూడా ఆస‌క్తిగా ఉన్న‌.. విష‌యం డ‌బ్బుల ద‌గ్గ‌ర ఆగింది.

ఒక టోర్నీ నిర్వాహ‌ణ‌కు భారీ ఖ‌ర్చు అవ‌స‌రం. మ‌రి..దానికి అవ‌స‌ర‌మైన మొత్తాన్ని ఇచ్చే స్పాన్స‌ర్ షిప్ ఎవ‌ర‌న్న‌ది చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా బ్రిట‌న్ లో స్థిర‌ప‌డ్డ భార‌త వ్యాపారి ఒక‌రు ముందుకు వ‌చ్చారు. స్వదేశంలో టోర్నీ జ‌రుగుతుంటే.. విదేశాల్లో ఉండే వ్య‌క్తి డ‌బ్బు చెల్లించ‌టం ఏమిట‌న్న అస‌హ‌నం నాటి ప్ర‌ధాని రాజీవ్ గాంధీ నోటి నుంచి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో దేశీయంగా టోర్నీని స్పాన్స‌ర్ చేసే వారి కోసం బీసీసీఐ గాలించ‌టం మొద‌లెట్టింది. ఈ సంద‌ర్భంగా పెద్ద అంబానీ వ‌ద్ద‌కు వెళ్లిన అధికారులు.. టోర్నీ గురించి ప్ర‌స్తావించి.. ఖ‌ర్చు లెక్క చెప్పారు. దీనికి అంబానీ స్పందిస్తూ.. టోర్నీకి ముందు భార‌త‌.. పాక్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే ఫ్రెండ్లీ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చే ప్ర‌ధాని కుర్చీ ప‌క్క‌న త‌న కుర్చీ వేస్తానంటే తాను టోర్నీకి అయ్యే ఖ‌ర్చు పెట్టుకుంటానని చెప్పార‌ట‌. అప్ప‌ట్లో రూ.9కోట్ల మొత్తం అంటే చాలా ఎక్కువ‌. మ‌రి.. అంత మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధ‌మైన అంబానీ కోరిక మేర‌కు నాటి ప్ర‌ధాని రాజీవ్ గాంధీ ప‌క్క‌న సీటు వేశారు. అంద‌రిలా ఆలోచిస్తే ఆయ‌న అంబానీ ఎందుక‌వుతారు? రూ.9కోట్ల మొత్తాన్ని ప్ర‌ధాని ప‌క్క సీటు కోసం ఖ‌ర్చు చేసిన అంబానీ.. ఆ త‌ర్వాత ఎంత‌లా త‌న వ్యాపారాన్ని విస్త‌రించారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదుగా?