Begin typing your search above and press return to search.

మూడు రోజుల క్రితం పెళ్లి .. పెళ్ళికొడుకు ఇంటికి నిప్పు పెట్టిన బంధువులు !

By:  Tupaki Desk   |   1 Feb 2021 4:00 PM IST
మూడు రోజుల క్రితం పెళ్లి .. పెళ్ళికొడుకు ఇంటికి నిప్పు పెట్టిన బంధువులు !
X
ప్రేమ ఈ రోజుల్లో చాలా సాధారణ విషయం. ప్రస్తుత రోజుల్లో యువతలో ఎక్కువ మందిప్రేమవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే, కొందరు ప్రేమించుకొని పెద్దలని ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుంటే, మరికొందరు ఇంట్లో నుండి పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారన్న ఆక్రోశంతో పెళ్లికొడుకు ఇంటికి పెళ్లికూతురు బంధువులు నిప్పంటించిన ఘటన నాగసముద్రంలో ఆదివారం చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... మండలంలోని వెంకటాంపల్లికి చెందిన బోయ మల్లికార్జున కూతురు సుమిత్ర గ్రామ వలంటీర్‌ గా పనిచేస్తోంది. నాగసముద్రం గ్రామానికి చెందిన నాగప్ప కుమారుడు హేమంత్‌ ఇంటర్‌ వరకూ చదివి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆదివారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో హాజరయ్యారు. వీరిద్దరూ మేజర్లు కావడంతో తల్లిదండ్రులను పిలిపించి సర్దిచెప్పి పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిని తమ ఇంట్లో పెట్టుకుంటే సమస్యలు వస్తాయని భావించిన పెళ్లికొడుకు తల్లిదండ్రులు నూతన వధూవరులను బంధువుల ఇంటికి పంపించారు. ఈ క్రమంలో పెళ్లికూతురు సుమిత్ర తరఫు బంధువులు కొందరు ఆదివారం సాయంత్రం నాగసముద్రంలోని పెళ్లికొడుకు హేమంత్‌ ఇంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు.

చుట్టుపక్కల వారు మంటలు ఆర్పివేయడంతోపాటు ఈ ఘటనకు పాల్పడ్డ వారిని మందలించి పోలీసులకు సమాచారం అందించారు.దీనితో వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు నిప్పంటించిన ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.