Begin typing your search above and press return to search.

370 ఆర్టిక‌ల్‌..కేంద్రానికి మాజీ సీఎం వార్నింగ్‌

By:  Tupaki Desk   |   31 March 2019 4:13 AM GMT
370 ఆర్టిక‌ల్‌..కేంద్రానికి మాజీ సీఎం వార్నింగ్‌
X
జ‌మ్ముక‌శ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి - పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని ఉపసంహరించాలన్న కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. 370వ అధికరణను కేంద్రం తొలిగిస్తే జమ్ముకశ్మీర్‌ తో భారతదేశానికి సంబంధాలు తెగిపోతాయని హెచ్చరించారు. ఈ మేర‌కు మెహబూబా ముఫ్తీ మీడియాతో మాట్లాడుతూ తేల్చిచెప్పారు.

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి అందిస్తున్న ఆర్టికల్ 370 పై ముప్తీ తాజాగా స్పందించారు. ఇండియాకు - కశ్మీర్ కు ఆర్టికల్ 370 అనేది వారధి లాంటిదన్నారు. కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హక్కు ఆర్టికల్ 370ని తొలగించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు మెహబూబా ముఫ్తీ. ఆ ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ ఆర్టికల్ 370 తొలగించినట్టయితే… భారత కేంద్ర ప్రభుత్వానికి కశ్మీర్ రాష్ట్రంతో సంబంధాలు తెగిపోతాయని మెహబూబా వార్నింగ్ ఇచ్చారు . గతంలో ఊహించని కొత్త పరిణామాలు ఎదురవుతాయని ఆమె అన్నారు. ‘370వ ఆర్టికల్‌ ను రాజ్యాంగం నుంచి ఉపసంహరించడం అంతా సులభంకాదనే విషయాన్ని జైట్లీ గమనించాలి. ఒకవేళ ప్రత్యేక హోదా రద్దుచేస్తే జమ్ముకశ్మీర్‌ తో కేంద్రానికి సంబంధాలు ఇక తొలిగిపోయినట్లే. కేంద్ర ప్రభుత్వం - కశ్మీర్‌ కు మధ్య వారధిలా 370వ అధికరణం వ్యవహరిస్తున్నది. దాన్ని మీరు తుంచేస్తే న్యూఢిల్లీ - జమ్ముకశ్మీర్‌ మధ్య సంబంధాలపై కొత్తగా సంప్రదింపులు జరుపాల్సి వస్తుంది. అప్పుడు సరికొత్త షరతులు తెరపైకి వస్తాయి. భారత్‌ లో తాము కొనసాగాలా? వద్దా? అనే విషయంపై రాష్ట్ర ప్రజలు పునరాలోచించుకోవాల్సి వస్తుంది. భారత రాజ్యాంగం కశ్మీర్‌ కు ప్రత్యేకహోదా కల్పించింది. కాబట్టే ఆ రాష్ట్రం అప్పట్లో భారత్‌లో చేరింది. ఈ సంబంధాలకు మీరు (కేంద్రం) గండికొడితే ఇక్కడి ప్రజలు పునరాలోచించుకుంటారు’ అని ఆమె హెచ్చరించారు.

ఆర్టికల్ 370తో పాటు.. కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు - అధికారాలు - సౌకర్యాలు కల్పిస్తున్న ఆర్టికల్ 35Aను కూడా రద్దు చేయాలని డిమాండ్లు ఊపందుకోవడంతో… మెహబూబా ముఫ్తీ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. కాగా, మాజీ సీఎం కామెంట్ల‌పై కేంద్రం స్పందించాల్సి ఉంది.