Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు సైతం జ‌య‌ల‌లిత వంటి ముప్పు ఉంది

By:  Tupaki Desk   |   11 Feb 2017 12:06 PM GMT
కేసీఆర్ కు సైతం జ‌య‌ల‌లిత వంటి ముప్పు ఉంది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చుట్టూ త‌మిళ‌నాడులో సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు కార‌ణ‌మైన శ‌శిక‌ళ వంటి కోట‌రి ఉంద‌ని, చిన్న‌మ్మ సార‌థ్యంలో న‌డిచి మ‌న్నార్ గుడి మాఫియా కుట్ర‌ల‌వలే కేసీఆర్‌పై సైతం జ‌రిగే అవకాశం ఉంద‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కేసీఆర్ ద‌గ్గ‌రి బంధువు అయిన రేగులపాటి రమ్యారావు ఆరోపించారు. గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన ర‌మ్య తాజాగా ఏపీలో జరిగిన మహిళా సదస్సులో కేసీఆర్ త‌న‌య‌, ఎంపీ మహిళల సాధికారత గురించి మాట్లాడటంపై మండిప‌డ్డారు. స్వంత ఇంటిని చక్కబెట్టవుకోలేని ఎంపీ కవిత, సాధికారత గురించి చెప్ప‌డం సిగ్గు చేటని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకున్నా కవిత ఏనాడైనా తండ్రిని ప్రశ్నించిందా అని నిల‌దీశారు. తెలంగాణ‌లోని పాత‌ పది జిల్లాల్లో తెరాస జిల్లా అధ్యక్ష పదవుల్లో కూడా ఒక్క మహిళకు అవకాశం ఇవ్వక‌పోయినా క‌విత ప్ర‌శ్నించిందా అంటూ ర‌మ్య సూటిగా అడిగారు. నిలోఫర్ హస్పిటల్ దుస్థితిపై కవిత ఎందుకు మాట్లాడారని ప్ర‌శ్నించారు. స్వంత రాష్ట్రంలో నిలదీయాల్సిందిపోయి.. పక్కరాష్ట్రంలో వారిని కీర్తించడం వల్ల ప్రయోజనం ఉండద‌ని పేర్కొన్నారు.

సదస్సులో లెక్చర్లు దంచడం కాదు మన రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి ముందు క‌విత ఆలోచించాల‌ని రేగులపాటి ర‌మ్య డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం ఆవకాశవాదానికి నిదర్శనమని ధ్వ‌జ‌మెత్తారు. ఇద్దరు చంద్రులు మూలాఖాత్ లో భాగంగానే ఈ సదస్సులో కవితకు ఆహ్వానం అందిందని ఆరోపించారు. కట్టుకున్న భర్తను గౌరవించాల్సిన అవసరం లేదని మెసేజ్ కవిత మాటల్లో కనిపిస్తోందని విమ‌ర్శించారు. అందరు తనలాగా భర్త ఇంటి పేరును పక్కన బెట్టి తండ్రి ఇంటి పేరును పెట్టుకోవాలా? అని ర‌మ్య ప్ర‌శ్నించారు. కళ్ళున్న ధృతరాష్ట్రుడి వ‌లే కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని, అనైతిక పొత్తుల కోసం పాకులాడుతున్న టీఆర్ఎస్‌కు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని ర‌మ్య పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం కెసిఆర్ కు ప్రాణహాని ఉంద‌ని ర‌మ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చుట్టూ ఉన్న కోటరీ తోనే కేసీఆర్ కు ప్రాణహాని ఉందని తెలిపారు. తమిళనాడులో మన్నారుగుడికి చెందిన‌ శశికళ కోటరీ జయలలితను పొట్టన పెట్టుకుంటే .. తెలంగాణ లో కుదురుపాక గ్రామానికి చెందిన కొందరు మాఫియా పొట్టన బెట్టుకునే ప్రమాదం ఉంద‌ని ప‌రోక్షంగా ఎంపీ క‌విత పేరును ప్ర‌స్తావించారు. కుదురుపాక శశికళ మాఫియా చేతిలో సీఎం కేసీఆర్ రబ్బర్ స్టాంపుగా మారారని ఆరోపించారు. కుదురుపాక శశికళ వర్గానికి ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యురిటీ ఎలా కలిపిస్తారని ఇటీవ‌ల ఎంపీ క‌విత‌కు భ‌ద్ర‌త పెంపు నిర్ణయాన్ని ర‌మ్య ప్ర‌శ్నించారు. కుదురుపాక మాఫియా నుంచి సీఎం ప్రాణాలను ఏ ఇంటిలిజెన్స్ కాపాడుతోందో చూడాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసీఆర్ కుదురుపాక మాఫియా ఆగడాలనుంచి బయటపడాలని హిత‌వు చెప్పారు.