Begin typing your search above and press return to search.

ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం డిసైడ్ చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   24 Oct 2020 10:15 AM IST
ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం డిసైడ్ చేసిన కేసీఆర్
X
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు తగ్గట్లే.. రిజిస్ట్రేషన్ విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములు.. వ్యవసాయేతర భూములతో పాటు.. ఆస్తులకు సంబంధించిన సర్వేను నిర్వహించటం.. వీటి వివరాల్ని ధరణి పోర్టల్ లో ఎక్కించి.. కొత్త తరహా రిజిస్ట్రేషన్లను షురూ చేస్తుండటం తెలిసిందే.

ఈ పోర్టల్ ను దసరా రోజు ప్రారంభించాలని భావించారు. అయితే.. అనుకోని రీతిలో విరుచుకుపడిన భారీ వర్షాలు.. వరదలతో ధరణి పోర్టల్ పనులుఆలస్యమవుతున్నాయి. పలు సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్న వేళ.. వాటిని ఒక కొలిక్కి తెచ్చేందుకు వీలుగా.. ముందుగా అనుకున్నట్లు దసరాకు ధరణి పోర్టల్ ఓపెన్ కాని పరిస్థితి.

ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 25న ధరణి పోర్టల్ ప్రారంభించాలని భావించారు. ఇప్పుడు ఆ ముహుర్తాన్ని మార్చారు. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు పోర్టల్ ను ప్రారంభించాలని డిసైడ్ చేశారు. ఆ రోజు నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

తొలుత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను మొదలు పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 570 మండలాల్లో ధరణి పోర్టల్ సేవల్ని షురూ చేయనున్నారు. హైదరాబాద్ లో వ్యవసాయ భూములు ఏమీ లేని కారణంగా.. హైదరాబాద్ లో మాత్రం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఆగనున్నాయి. తొలుత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను షురూ చేసి.. రిజిస్ట్రేషనలు చేసే సమయంలో చోటు చేసుకునే సమస్యల్నిపరిశీలిస్తారు. తదనంతరం వ్యవసాయేతర భూములు.. ఇతర ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.