Begin typing your search above and press return to search.

త‌లాక్ చెప్పి త‌ప్పించుకుంటే కుద‌ర‌దు!

By:  Tupaki Desk   |   29 July 2016 6:17 AM GMT
త‌లాక్ చెప్పి త‌ప్పించుకుంటే కుద‌ర‌దు!
X
గొంతెమ్మ కోరిక‌లు ఎక్కువైతే ఇలానే జ‌రుగుతుంది! అత్త‌మామ‌లు ఇస్తున్న క‌ట్న‌కానుక‌లు చాలవంటూ ఓ వ‌రుడు క‌ల్యాణ మంట‌పంలోనే చిందులు తొక్కాడు. సంద‌డిగా జ‌ర‌గాల్సిన పెళ్లి వేడుక‌ల్ని పెటాకులు చేశాడు. అయితే, ఈ సంఘ‌ట‌న ఇంకో మ‌లుపు తిరిగింది! ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని మీర‌ట్ స‌మీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకున్న ఘ‌ట‌న ఇది.

వ‌రుడు భ‌గ‌వాన్‌ పూర్‌ కి చెందిన మ‌హ్మ‌ద్ అరీఫ్ భాగ్ప‌త్‌. వ‌ధువు ద‌హా గ్రామానికి చెందిన మొహ‌సీనా. ఇద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. రెండు కుటుంబాలు మాట్లాడుకున్నాక నిఖా ప‌క్కా చేసుకున్నారు. అడిగిన క‌ట్న‌కానుక‌లు కూడా ఇచ్చేందుకు వ‌ధువు కుటుంబ స‌భ్యులు ఒప్పుకున్నారు. దీంతో బంధుమిత్రుల కోలాహలంతో క‌ల్యాణ‌మంట‌పం క‌ళ‌క‌ళ‌లాడింది. కాసేప‌ట్లో పెళ్లి వేడుక‌లు పూర్తై అంద‌రూ హ్యాపీగా వెళ్లిపోతారు అనుకునే స‌మ‌యానికి... పెళ్లి కుమారుడికి ఓ గొంతెమ్మ కోరిక క‌లిగింది! తన‌కు కారు కొనిపెట్ట‌లేద‌ని అత్త‌మామ‌ల‌పై చిందులు తొక్కాడు. అంతేకాదు, వ‌ధువు ద‌గ్గ‌ర‌కి వెళ్లి - మ‌త పెద్ద‌ల స‌మ‌క్షంలో త‌లాక్‌ - త‌లాక్‌ - త‌లాక్ మూడుసార్లు చెప్పేసి వెళ్లిపోయాడు. దీంతో వ‌ధువు మొహ‌సీనా కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు. పెళ్లికుమారుడు కోరిన‌ట్టు అన్నీ ఇస్తున్నాం - కానీ ఇప్ప‌టికిప్పుడు కారు కొనివ్వ‌మంటే ఎలా తెస్తాం అంటూ వారు ఆవేద‌న చెందారు.

త‌రువాత‌, ఈ వ్య‌వ‌హారం పంచాయతీ వ‌ద్ద‌కు వెళ్లింది. పెద్ద‌లు న‌చ్చ‌జెప్ప‌డంతో మొహ‌సీనాను భార్య‌గా స్వీక‌రించేందుకు ఒప్పుకున్నాడు ఆరిఫ్‌. కానీ, మొహ‌సీనా మాత్రం అత‌డితో కాపురం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు! వాళ్లింటికి వెళ్ల‌ను అని తెగేసి చెప్పేసింది. స్థిర‌మైన ఆలోచ‌న‌లు లేని ఇలాంటి వ్య‌క్తితో జీవితాంతం గ‌డ‌ప‌లేన‌ని చెప్పేసింది. కారు కొని ఇవ్వ‌లేద‌న్న కార‌ణంతో త‌లాక్ చెప్పిన ఆరిఫ్‌ కు రూ. 2.25 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం వ‌ధువు కుటుంబానికి చెల్లించాలంటూ పంచాయ‌తీ పెద్ద‌లు తీర్పు చెప్పారు. అంతేకాదు, వరుడు ఆరిఫ్‌ కు మూడేళ్ల‌పాటు పెళ్లి చేసుకోకూడ‌ద‌ని కూడా ష‌ర‌తు విధించారు. త‌లాక్ చెప్పి త‌ప్పించుకోవాల‌ని చూస్తే.. ఇదిగో ఇలానే రంగుప‌డుద్ది. దేశవ్యాప్తంగా త‌లాక్ వ్య‌వ‌హారంపై ముస్లిం మ‌హిళ‌లు ఆందోళ‌న‌లు చేప‌డుతున్న త‌రుణంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది.