Begin typing your search above and press return to search.

2021 టోక్యో ఒలింపిక్స్ బరిలో శరణార్థులు.. వీళ్లది ప్రపంచ జట్టు

By:  Tupaki Desk   |   16 July 2021 9:17 AM GMT
2021 టోక్యో ఒలింపిక్స్ బరిలో శరణార్థులు..  వీళ్లది ప్రపంచ జట్టు
X
మత హింసలు, రాజకీయ హింసలు, అంతర్యుద్ధాలు, ఈ సమాజం ఎంత నాగరికత సాధించినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా మానవ పీడనం మాత్రం ఆగట్లేదు. కొన్ని దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. హింస తాళలేక ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది మాతృదేశాల నుంచి పారిపోయి ఇతర దేశాల్లో దిక్కులేక జీవనం గడుపుతున్నారు. ఎలాంటి వారిలో ఎక్కువ మంది సిరియా, అఫ్గానిస్థాన్‌, సౌత్‌ సుడాన్‌, మయన్మార్‌ కు చెందినవాళ్లే. వీళ్లు తిరిగి స్వదేశానికి వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడుంటున్న దేశాల్లోనూ చాలా మంది పరిస్థితి దుర్భరం. కనీస సదుపాయాలు సరైన విద్య, ఆరోగ్య సేవలు అందక కష్టంగా కాలం గడుపుతున్నారు. వివక్షనూ ఎదుర్కొంటున్నారు.

శరణార్థులకు క్రీడల్లోనూ అవే కష్టాలు. ఆటపై మమకారం చంపుకోలేక.. తమ సొంత దేశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేక ఎంతో వేదన చెందుతున్నారు. ఇలాంటి వాళ్ల కోసమే అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం ఓ గొప్ప ఆలోచన చేసింది. వారికి ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్లతో పోటీపడే అవకాశం ఇవ్వడం కోసం ఒలింపిక్స్‌ లో శరణార్థుల జట్టును బరిలోకి దించుతోంది.

నాలుగేళ్ల కిందే రియో ఒలింపిక్స్‌లో తొలిసారి శరణార్థులను బరిలో దింపింది అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం. శరణార్థుల ఒలింపిక్‌ జట్టు తరఫున పోటీపడ్డ పది మందిలో ఒక్కరూ పతకం నెగ్గకపోయినా ఐఓసీ ప్రయత్నం అందరి మన్ననలను గెలుచుకుంది.

యుస్రా ప్రతిభావంతురాలైన స్విమ్మర్‌. సొంత దేశం యుద్ధంతో అతలాకుతలమైన సిరియా. అంతర్జాతీయ టోర్నీల్లో సిరియాకు ఆమె ప్రాతినిధ్యం వహించింది కూడా. అంతర్యుద్ధంలో తన ఇల్లు ధ్వంసమయ్యాక 2015లో, 17 ఏళ్ల వయసులో ఆమె చెల్లితో కలిసి సిరియా నుంచి పారిపోయింది. ఎంతో కష్టంగా టర్కీకి చేరుకుంది. టర్కీ నుంచి చాలా ప్రమాదకర పరిస్థితుల్లో చిన్న పడవలో, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్రమ మార్గంలో గ్రీస్‌ చేరుకుంది.

అక్కడి నుంచి జర్మనీకి వెళ్లింది. ఇప్పుడు ఆమె ఉంటున్నది అక్కడే. మామూలుగానైతే జీవనమే కష్టం. కానీ ఐఓసీ కారణంగా తన కలలను సాకారం చేసుకునే అవకాశం రావడం వల్ల యుస్రా మురిసిపోతోంది. ఇక అఫ్గానిస్థాన్‌ స్లైకిస్ట్‌ మసోమా అలీ జాదా మహిళలపై చాందసవాదుల కఠిన ఆంక్షల కారణంగా ఫ్రాన్స్‌ పారిపోయింది. శరణార్థుల జట్టులో అందరివీ ఇలాంటి గాథలే. ఒలింపిక్స్‌లో పోటీపడడం ఎంతో వ్యథకు గురైన వీరికి సాంత్వనే.

గత ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు విజయవంతంగా పాల్గొన్న నేపథ్యంలో ఐఓసీ.. ఈసారి 29 మందితో కూడిన బలమైన జట్టుకు టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం కల్పించింది. 13 దేశాలకు చెందిన 55 మంది ప్రతిభావంతులైన అథ్లెట్ల నుంచి వీరిని ఎంపిక చేశారు. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, తైక్వాండో, కరాటె, జూడో, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌.. తదితర క్రీడల్లో ఈ శరణార్థ అథ్లెట్లు పోటీపడతారు.

ఇందులో రియోలో పోటీపడ్డవాళ్లు ఆరుగురు ఉన్నారు. 2016 ఒలింపిక్స్‌లో ఇరాన్‌ తరఫున తైక్వాండోలో కాంస్యం గెలిచిన ఇమిమా అజాదే కూడా ఇందులో ఉన్నాడు. ఆరంభోత్సవ కార్యక్రమంలో శరణార్థుల జట్టు.. గ్రీస్‌ తర్వాత రెండో జట్టుగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటుంది. ఒలింపిక్‌ పతాకం కింద పోటీపడే వీళ్లు ఒకవేళ పతకం గెలిస్తే.. పతక ప్రదాన కార్యక్రమం సందర్భంగా ఒలింపిక్‌ గీతాన్ని వినిపిస్తారు.

బ్యాడ్మింటన్, బాక్సింగ్, కానోయింగ్, సైక్లింగ్, జూడో, కరాటే, టైక్వాండో, షూటింగ్, ఈత, వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ వంటి 12 క్రీడల్లో శరణార్థుల జట్టు పోటీపడనుంది. శరణార్థుల ఒలింపిక్‌ జట్టు టోక్యో 2020 ఒలింపిక్స్‌లో పాల్గొనడమంటే, శాంతిని ఉత్సవంలా జరుపుకోవడమే. ఇది శరణార్థుల సమస్యలపై ప్రపంచం దృష్టి మళ్లేలా చేస్తుంది. ఫలితంగా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరమవుతాయి అని టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో కీలక వ్యాఖ్యలు చేశారు.