Begin typing your search above and press return to search.

రీల్ విలన్స్.. రియల్ హీరోలుగా మారుతున్నారు

By:  Tupaki Desk   |   26 May 2020 4:30 AM GMT
రీల్ విలన్స్.. రియల్ హీరోలుగా మారుతున్నారు
X
హీరోలకు ఏ మాత్రం తీసిపోని పర్సనాలటీ. అయినప్పటికీ రీల్ లైఫ్ లో హీరో అయ్యే అవకాశం రాని పరిస్థితి. దీంతో.. విలన్ పాత్రలు వేసే వారు రియల్ లైఫ్ లో మాత్రం తమకొచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవటం లేదు. టాలీవుడ్.. బాలీవుడ్ తో పాటు పలు భాషా చిత్రాల్లో విలన్ గా మెప్పించిన సోనూసూద్ కావొచ్చు.. తన సెకండాఫ్ లో అద్భుతమైన విలనీని ప్రదర్శిస్తున్న జగపతి బాబు కానీ వలసల విషయంలో వారు స్పందిస్తున్న తీరుకు ఫిదా కావాల్సిందే.

లాక్ డౌన్ వేళ.. సొంతూరు వెళ్లేందుకు కిందా మీదా పడుతున్న వలసకార్మికులను వారి ఊళ్లకు చేర్చేందుకు తమ వంతుగా చేస్తున్న ప్రయత్నాల గురించి తెలిస్తే ఫిదా కావాల్సిందే. సొంతూరు చేరేందుకు రిక్వెస్టు వచ్చిన వెంటనే వారిని.. వారి ప్రాంతాలకు పంపేందుకు సోనూ సూద్ చేసిన ప్రయత్నాలు మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. తాజాగా.. ఆ జాబితాలో చేరారు జగపతిబాబు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినా.. ఈ మధ్యన విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటిస్తున్న ఆయన.. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి వెళ్లాల్సిన వలస కార్మికులను వారి ఊళ్లకు చేర్చేందుకు వీలుగా చేసిన ప్రయత్నం ఆసక్తికరంగా మారింది.

తాజాగా హైదరాబాద్ నుంచి పశ్చిమబెంగాల్ కు వెళ్లాల్సిన వలసకార్మికుల్ని వారి సొంతూళ్లకు చేర్చేందుకు వీలుగా రెండు ప్రైవేటు బస్సుల్ని ఏర్పాటు చేశారు. సొంత ఖర్చుతో వారిని వారి ఊళ్లకుపంపాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఈ రెండు బస్సులు పశ్చిమబెంగాల్ కు పయనమయ్యాయి. రీల్ లో విలనిజం పండించే నటులు.. రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి రియల్ హీరోలుగా వారు చేస్తున్న ప్రయత్నాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.