Begin typing your search above and press return to search.

టీటీడీపీ.. రెడ్డి బ్యాచ్ మొత్తం కాంగ్రెస్ లోకేనా?

By:  Tupaki Desk   |   18 Oct 2017 1:46 PM GMT
టీటీడీపీ.. రెడ్డి బ్యాచ్ మొత్తం కాంగ్రెస్ లోకేనా?
X
రుతువులు మారి చెరువు ఎండిపోయే పరిస్థితి వచ్చిందంటే.. ముందుగా ఆ చెరువులో ఎంతో కాలంగా నివాసం ఉంటున్ కప్పలు ఖాళీ చేయడం ప్రారంభిస్తాయి. కప్పలు చెరువును వీడి వెళ్లిపోతున్నాయంటే.. దాని అర్థం త్వరలోనే ఆ చెరువు ఎండిపోతుందని!! ఇదే భావాన్ని.. ‘‘కుప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు జేరు గదరా సుమతీ’’ అని సుమతీ శతకకారుడు చెప్పనే చెప్పారు కూడా. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పరిస్థితి గమనిస్తే.. ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న చెరువునే తలపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అంపశయ్య పై ఉన్నదని పార్టీ పరిస్థితిని గమనిస్తున్న ఎవ్వరికైనా అర్థమవుతుంది. అలాంటప్పుడు పార్టీలోనే ఉండి - అంతర్గతంగా పార్టీ ఎలా నాశనం అవుతున్నదో గమనిస్తున్న సీనియర్ నేతలకు బోధపడకుండా ఉంటుందా? తెరాస అధినేత కేసీఆర్ ఆకర్ష దెబ్బకు నిజానికి ఈ కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ కంటె తెలుగుదేశం బాగా ఎక్కువగా నష్టపోయింది. కేసీఆర్ కూడా స్వయంగా ఒకప్పటి తెదేపా నాయకుడే కావడం వల్ల.. అప్పటి పాత పరిచాయాలు అన్నీ ఆయనకు కలిసి వచ్చాయి. సీనియర్లు అందరూ .. తమ పాత సహచరుడి వద్దకే వెళుతున్నట్లుగా చాలా పాజిటివ్ ఒపీనియన్ తో ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. కేసీఆర్ అంటే ఏ మాత్రం గిట్టని - వ్యక్తిగతంగా వైరభావం ఉన్న వారు మాత్రమే తె-తెలుగుదేశం లో మిగిలిపోయారని చెప్పాలి. అయితే అంపశయ్య పై ఉన్న పార్టీ నుంచి తమ భవిష్యత్తు తాము చూసుకోవడానికి ఎవరి దారి వారు వెతుక్కునే ప్రయత్నాలు ఇప్పుడు మొదలయ్యాయి. తెలంగాణ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో.. అసలు పార్టీకి తానే ఏకైక దిక్కూ మొక్కుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. అక్కడ కూడా రాష్ట్రస్థాయిలో కీలక పదవినే దక్కించుకుని చక్రంతిప్పే విధంగానే ఆయన వెళ్లనున్నట్లు సమాచారం. అయితే తెతెదేపాకు ఎదురుదెబ్బలు కేవలం రేవంత్ రూపంలో మాత్రమే.. కాదు.. ఇంకా అనేకం పొంచి ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

తెలుగుదేశానికి ఒకప్పట్లో వెన్నుదన్నుగా ఉన్న సీనియర్ నాయకుడు మాధవరెడ్డి భార్య - ఉమామాధవ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. కేసీఆర్ తన గులాబీ పార్టీలో రెడ్డి వర్గానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనే వాదన కూడా ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో తెతెదేపాలో ఉండే రెడ్డి వర్గం ప్రముఖులు అందరూ ఇక కాంగ్రెస్ ఒక్కటే తమ భవిష్యత్ ప్రత్యామ్నాయం అని ఎంచుకున్నట్లుగా సమాచారం తెలుస్తున్నది. మొత్తానికి గులాబీ తీర్థం పుచ్చుకునే వారు ముందే వెళ్లిపోగా, ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరుతున్న వారి పోకలు మొత్తం పరిసమాప్తం అయ్యేసరికి తెతెదేపా ఖాళీ అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.