Begin typing your search above and press return to search.

ఎర్రకూలీల అసలు రంగు ఇదే

By:  Tupaki Desk   |   9 April 2015 3:52 AM GMT
ఎర్రకూలీల అసలు రంగు ఇదే
X
ఎర్రచందం స్మగ్లర్లకు అడుగడుగునా సాయం చేస్తూ ఉండే ఎర్రచందనం దొంగల్ని కూలీలుగా చిత్రీకరిస్తూ.. చెబుతున్న వైనంపై పలువర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తముతోంది. శేషాచల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మృత్యువాత పడటం.. దీనిపై తమిళనాడు ప్రభుత్వం తెగ ఫీలైపోవటం లాంటివి జరిగాయి. దొంగలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వంగా తమిళనాడు సర్కారు మిగిలిపోనుంది.

శేషాచల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఎర్రచందనం దొంగలకు రూ.3 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంతకీ అసలు వీరు ఎవరు? వీరు కూలీలేనా? లేక దొంగలా? లాంటి దానిపై తమిళనాడుకు చెందిన ''నల్ల ఇదల్‌'' అనే తమిళ మాసపత్రిక కొద్ది నెలల క్రితం ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఎర్రచందనం దొంగల గురించి వివరంగా కథనంలో వెల్లడించారు.

గతంలో వీరంతా తమిళనాడు పరిధిలోనే ఎర్రచందనం చెట్లను నరికేవారని.. నాటుసారా తయారు చేసేవారని తేల్చింది. తమిళనాడు పోలీసుల కఠిన చర్యలు నేపథ్యంలో.. వారిప్పుడు ఆంధ్రా బాట పడ్డారు. అంతేకాదు.. వీరు చెట్లను నరకటంతో పాటు.. అటవీ సిబ్బంది మీదా.. పోలీసులు మీదా దాడులు జరపటం.. అవసరమైతే ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడకపోవటం లాంటి ఘన చరిత్ర వీరికి చాలానే ఉందని పేర్కొంది.

ఈ ఎర్రచందనం దొంగలు డబ్బులకు ఆశపడి ఇలాంటి పనులు చేస్తున్నారని.. ఇలాంటి వారు దాదాపు 1500 మంది ఆంధ్రా జైళ్లలో మగ్గుతున్నారని సదరు కథనంలో పేర్కొన్నారు. అంతేకాదు.. టాస్క్‌ఫోర్స్‌ డీజీపీ కాంతారావు హెచ్చరికను కూడా సదరు కథనంలో ప్రస్తావించింది.

మార్చి 5 తేదీన టాస్క్‌ఫోర్స్‌ డీజీపీ కాంతారావు తమిళనాడు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అందులో ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడు నుంచి భారీగా వస్తున్నారని.. అలాంటి వారిని రాష్ట్ర సరిహద్దులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించటంతో పాటు.. తాము ఎర్రచందం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ముందస్తుగా పేర్కొన్నట్లు వెల్లడించింది. ఇంత జరిగిన తర్వాత కూడా.. దొంగలకు వత్తాసు పలుకుతూ తమిళనాడు సర్కారు వ్యవహరించటం చూసినప్పుడు అసలు రాజకీయం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.