Begin typing your search above and press return to search.

ప్రజల సంపద.. దొంగలపాలు!

By:  Tupaki Desk   |   9 April 2015 1:30 AM GMT
ప్రజల సంపద.. దొంగలపాలు!
X
వందల కోట్ల రూపాయలు! అంతా ప్రజల సంపద! ప్రకృతి సంపద! రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ చెందాల్సిన సంపద! కానీ, కొద్దిమంది స్మగ్లర్లు ఎగరేసుకుపోతున్నారు. వారు మాత్రమే సంపాదనపరులు అవుతున్నారు. ఎనిమిది కోట్ల ప్రజల ప్రయోజనాలను దాదాపు ఒక వంద మంది మాత్రమే దోపిడీ చేస్తున్నారు. ఇది సమంజసమా!? వాళ్లే ఎర్ర దొంగలు. వాళ్లు కేవలం ఎర్ర దొంగలను మాత్రమే దోపిడీ చేయడం లేదు.. ఏపీ ప్రజల సంపదను కూడా దోపిడీ చేస్తున్నారు ఏకకాలంలో! వారిని అడ్డుకోవడమే తప్పా!?

తిరుపతి జిల్లాలోని శేషాచలం అడవుల్లో అపారమైన ఎర్ర చందనం సంపద ఉంది. ఇదంతా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిదీ. దానివల్ల రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరిగితే అంతకంటే భేషైన పని మరొకటి లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ గత ఆరు దశాబ్దాల్లో దాని వల్ల రాష్ట్రంలోని ఒక్కరికి కూడా మేలు జరిగిన దాఖలాలు లేవు. అసలు అక్కడ స్మగ్లింగ్‌ గురించి పట్టించుకున్న నాథుడే లేడు. దాంతో కొన్ని వేల కోట్ల రూపాయల అటవీ సంపద దొంగల పాలయిపోయింది.

గంగిరెడ్డి కావచ్చు.. మరొకడు కావచ్చు.. ఇలా ఓ పదిమంది బడా స్మగ్లర్లు.. వారి వద్ద ఉండే మరికొంతమంది చిన్న చిన్న స్మగ్లర్లు మాత్రమే వీటితో భారీగా లబ్ధి పొందారు. అలాగే, గంగిరెడ్డి వంటి దేశ ద్రోహులకు కొమ్ముకాసిన రాజకీయ పార్టీలు కూడా ఈ పాపంలో భాగం పంచుకున్నాయి. గంగిరెడ్డి వైసీపీ నేతలకు సన్నిహితుడు అని కొందరు ఆరోపిస్తే.. మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సోదరులకు ఎర్ర చందనం ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు గతంలోనే వచ్చాయి. ఎవరైనా కావచ్చు.. మన రాజకీయ నాయకులే ప్రజా సంపదను దొంగలకు దోచి పెడుతున్నారు.

కొన్ని వందల మంది కూలీలు ప్రతి రోజూ శేషాచలం అడవుల్లోకి వచ్చి ఎర్ర చందనం దుంగలను దొంగిలించుకుపోతున్నారు. దీని విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. అయినా, ప్రభుత్వ లెక్కనే తీసుకున్నా.. రోజుకు మూడు కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను దోచుకుపోతున్నారని అనుకుందాం. అంటే నెలకు దాదాపు వంద కోట్లు. ఇది చాలా తక్కువ అయినా ఉదాహరణకు తీసుకుందాం. ఏడాదికి రూ.1200 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన ఆరు దశాబ్దాల్లో దాదాపు లక్ష కోట్ల రూపాయల ఎర్ర చందనం దొంగల పాలయింది. ఇందులో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రయోజనం కలగలేదు. కనీసం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని నిరుపేదలకు కూడా. ఈ లక్ష కోట్ల రూపాయలనూ బడా స్మగ్లర్లు, చిన్న చిన్న స్మగ్లర్లు, దొంగలు, రాజకీయ పార్టీలు, కూలీలు పంచుకున్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేయడం ఎలా తప్పవుతుంది!?

ఎర్ర చందనం దోపిడీని అరికట్టడాన్ని తాము తప్పుపట్టడం లేదని, కానీ కూలీలను చంపితే మాత్రం తప్పవుతుందంటూ పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కూలీలను కాల్చేశారంటూ వైసీపీ పత్రిక ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజా ప్రయోజనాలను విస్మరించి, దొంగలు, స్మగ్లర్లు, అరాచకవాదులకు కొమ్ముకాసే ఇటువంటి పార్టీలు మనకు అవసరమా?