Begin typing your search above and press return to search.

రికార్డింగ్ డ్యాన్స్ ఆపే పోలీసులపై రాళ్లేశారు

By:  Tupaki Desk   |   16 Jan 2016 7:49 PM GMT
రికార్డింగ్ డ్యాన్స్ ఆపే పోలీసులపై రాళ్లేశారు
X
సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నా.. వాటిని నిలువరించే విషయంలో పోలీసులు ఏ మాత్రం ప్రయత్నం చేసినా వారికి చేదు అనుభవం ఎదురవుతుంది. ఓపక్క కోర్టు విస్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా కోడి పందాల నిర్వహణ విషయంలో పలు జిల్లాలు పట్టించుకోకుండా ఓ రేంజ్ లో నిర్వహించటం తెలిసిందే.

నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు మాటలు చెప్పినా.. చేతల్లో మాత్రం అలా చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రభల తీర్థం వద్ద శుక్రవారం రాత్రి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. కొంతసేపు బాగానే సాగినా.. తర్వాత వ్యవహారం పూర్తిగా తేడా వచ్చేసింది.

దీంతో.. పోలీసులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. రికార్డింగ్ డ్యాన్స్ లు అంటూ అశ్లీల నృత్యాలేంటని ప్రశ్నించారు. దీంతో అక్కడి వారికి కోపం వచ్చేసింది. అశ్లీల నృత్యాల మత్తులో ఉన్న అక్కడి యూత్ పోలీసులపై చెలరేగిపోయింది. రాళ్లు చేత పట్టుకొని.. ఖాకీల మీద రాళ్ల వర్షం కురిపించారు. దీంతో.. పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. రాళ్లు విసిరిన ఘటనలో ముగ్గురు పోలీసులకు రాళ్లు తగిలి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ వ్యవహారంపై పోలీసు శాఖ సీరియస్ గా ఉంది. పండగను పండగలా చేసుకోవాలే కానీ.. ఇష్టారాజ్యంగా కాదన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారో..?