Begin typing your search above and press return to search.

లేటెస్ట్‌- తెలంగాణ‌ లో రికార్డు స్థాయి ఓటింగ్ !

By:  Tupaki Desk   |   8 Dec 2018 2:39 PM GMT
లేటెస్ట్‌- తెలంగాణ‌ లో రికార్డు స్థాయి ఓటింగ్ !
X
తెలంగాణ చ‌రిత్ర‌లో నే అత్య‌ధిక ఓటింగ్ న‌మోద‌య్యింది. తెలంగాణ వ్యాప్తంగా 76.5 శాతం పోలింగ్ న‌మోదైంది. ఎందుకీ ఉధృతి. ఎపుడూ లేనంత ఉత్సాహం ఓట‌ర్ల‌ లో ఎందుకు వ‌చ్చింది? దీనికి దారి తీసిన ప‌రిస్థితులు ఏంటి? అంటే ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత మాత్ర‌మే క‌చ్చితంగా తెలుస్తుంద‌ని చెప్పాలి.

అయితే, అంత‌వ‌ర‌కు కొన్ని ప్రాథ‌మిక విష‌యాల‌ను ప‌రిశీలిస్తే... చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేన‌న్ని సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డం కూడా ఓటింగ్ పెర‌గ‌డానికి కార‌ణం అని విశ్లేష‌కులు అంటున్నారు. అటు టీఆర్ఎస్‌- ఇటు ప్ర‌జా కూట‌మి రెండూ భారీ ప‌థ‌కాలు ప్ర‌క‌టించాయి. కాబ‌ట్టి... ఎవరు ఏ పార్టీని అభిమానిస్తే... ఆ పార్టీ క‌చ్చితంగా గెలిస్తే త‌ప్ప‌కుండా మ‌న‌మూ ల‌బ్ధిదారుల్లో ఉంటాం అన్న ఆశ గ్రామీణ ఓట‌ర్ల‌ను ఈ స్థాయిలో ప్ర‌భావితం చేసి ఉండొచ్చు.

ఇక శుక్ర‌వారం ఓటింగ్ రావ‌డం వ‌ల్ల కూడా ఎక్కువ మంది స్వ‌స్థ‌లాల‌కు వెళ్లి ఓటింగ్ వేసే అవ‌కాశం ఉంది. సాధార‌ణంగా గ్రామాల్లో ఉండి ఓటు వేయ‌క‌పోవ‌డం అనేది దాదాపు జ‌ర‌గ‌దు. అందుకే ఎక్కువ మంది గ్రామాల‌కు వెళ్ల‌డం వ‌ల్ల భారీగా ఓటింగ్‌ న‌మోదు అయ్యింది. అన్ని ర‌వాణా వాహ‌నాలు గురువారం రాత్రి కిక్కిరిశాయి. రైలు- బస్సుల‌ తో పాటు ప్రైవేటు వాహ‌నాలు కూడా ర‌ద్దీ గా బ‌య‌లుదేరాయి.

ఇక మ‌రో వైపు సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఈ ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున ఉంది. అందువ‌ల్ల మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వాళ్లు, విద్యావంతులు ఎక్కువ శాతం ఈ సారి ఓటింగ్‌ లో పాల్గొన్నారు. సెల్ఫీల పిచ్చి కూడా జ‌నాల చేత ఓటేయించింది. కొత్త ఓట‌ర్లు ఎపుడూ లేనంత ఉత్సాహంగా ఓటేసి ఫొటోలు సోష‌ల్ మీడియా పెడుతున్నారు. ఇది ఒక‌రిని చూసి ఒక‌రు పోలింగ్ బూత్ వైపు వెళ్లే లా చేసింది.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ల‌గ‌డ‌పాటి చెప్పిన‌ట్టు పోలింగ్ శాతం పెరిగితే ప్ర‌జాకూట‌మికి లాభిస్తుందా? లేక కే టీ ఆర్ చెప్పిన‌ట్టు ల‌గ‌డ‌పాటి స‌ర్వే ల నుంచి కూడా స‌న్యాసం తీసుకుంటారా?