Begin typing your search above and press return to search.

అగ్నపథ్ లో దరఖాస్తుల రికార్డు

By:  Tupaki Desk   |   6 July 2022 3:39 AM GMT
అగ్నపథ్ లో దరఖాస్తుల రికార్డు
X
ఈ మధ్య యావత్ దేశంలో అత్యంత వివాదాస్పదంగా అల్లర్లకు కారణమైన అగ్నిపథ్ పథకంలో ఐఏఎఫ్ లో నియామకాలకు వచ్చిన దరఖాస్తులు రికార్డు సృష్టించాయి. భారతీయ వాయు సేన (ఐఏఎఫ్) లో చేరేందుకు 7.5 లక్షల దరఖాస్తులు అందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఒకవైపు దేశంలోని చాలా రాష్ట్రాల్లో బాగా అల్లర్లు జరగటానికి కారణమైన అగ్నిపథ్ పథకంలో నియామకాలకు ఇన్ని లక్షలమంది యువత ఆసక్తి చూపటం గమనార్హం.

జూన్ 24వ తేదీన మొదలైన దరఖాస్తుల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. దాంతో ఎన్ని లక్షలమంది ఎయిర్ ఫోర్స్ లో చేరటానికి ఆసక్తిగా ఉన్నారనే విషయంలో స్పష్టత వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో ఇదే ఐఏఎఫ్ లో ఒక నియామక ప్రక్రియలో వచ్చిన దరఖాస్తులు 6.31 లక్షలు మాత్రమే. అలాంటిది ఇపుడు 7.5 లక్షల దరఖాస్తులు రావటంతో ఉన్నతాధికారులు చాలా హ్యాపీగా ఉన్నారు.

ఇది కేవలం ఐఏఎఫ్ లో నియామకాలకు వచ్చిన దరఖాస్తులు మాత్రమే ఇంకా ఆర్మీ, నేవీ కూడా ఉన్నాయి. వీటిల్లో కూడా తొందరలోనే దరఖాస్తుల ప్రక్రియ మొదలవ్వబోతోంది. ఈ ప్రక్రియ మొదలైన తర్వాత వీటికి ఎన్ని దరఖాస్తులు వస్తాయో చూడాల్సిందే.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించగానే దేశంలోని సుమారు 10 రాష్ట్రాల్లో భారీ స్థాయిలో జరిగిన అల్లర్లు అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో అయితే ఏకంగా రైల్వేస్టేషన్లనే తగులబెట్టేశారు. మరికొన్ని జిల్లాల్లో రైళ్ళ బోగీలను దగ్ధం చేసి ఫర్నీచర్ ను తగలబెట్టేశారు.

ఈ మధ్యకాలంలో ఇంతటి వివాదాస్పదమైన కేంద్రం పథకం మరోటి లేదని చెప్పవచ్చు. ఇన్ని అల్లర్లు జరిగినా యువత లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేశారంటే అర్ధమేంటి ? ఉద్యోగాల కోసం యువత ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతోంది.

2014 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ గాలికి కొట్టుకుపోయింది. అందుకనే తాత్కాలిక ఉద్యోగాలని తెలిసినా ఇన్ని లక్షలమంది దరఖాస్తులు చేస్తున్నారు.