Begin typing your search above and press return to search.

అమెరికాలో 32వేలకుపైగా టెకీల తొలగింపు.. భారతదేశం కంటే ఎక్కువ

By:  Tupaki Desk   |   1 Aug 2022 12:30 PM GMT
అమెరికాలో 32వేలకుపైగా టెకీల తొలగింపు.. భారతదేశం కంటే ఎక్కువ
X
కరోనా దెబ్బకు ఎంతో మంది ఉద్యోగ ఉపాధి పోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ఉప్పెనలా విరుచుకుపడుతోంది. దీంతో చాలా సంస్థలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించడమే మొదటి ఆప్షన్ గా ఎంచుకుంటున్నాయి. తాజాగా ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరియు మెటా (గతంలో ఫేస్‌బుక్) వంటి పెద్ద టెక్ కంపెనీలతో సహా ఈ ఏడాది జూలై వరకు అమెరికాలో 32,000 మందికి పైగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను తొలగించారు. భారీ స్టాక్ అమ్మకాలను చూసిన టెక్ సెక్టార్‌లో ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఉన్నాయి. దీంతో అవసరం లేని.. స్కిల్ లేని టెకీలను ఉద్యోగాల నుంచి తొలగించేస్తున్నారు.

క్రంచ్‌బేస్ సంకలనం చేసిన డేటా ప్రకారం.. జూలై చివరి నాటికి అమెరికా టెక్ సెక్టార్‌లో 32,000 కంటే ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉద్యోగాల కోతలలో భాగంగా భారీ ఎత్తున తొలగించబడ్డారు. "అమెరికాలో ఉన్న స్టార్టప్‌లు.. పబ్లిక్‌గా వర్తకం చేసే కంపెనీలు రెండింటిలోనూ ఈ తొలగింపు జరిగింది. యునైటెడ్ స్టేట్స్‌లో క్లార్నా వంటి గణనీయమైన స్థాయిలో ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలు కూడా ఈ తొలగింపులు చేపట్టడం గమనార్హం. ఉబెర్, నెట్‌ఫ్లిక్స్ మరియు అనేక క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు మరియు లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ ఉద్యోగులను తొలగించారు.

రాబిన్‌హుడ్, గ్లోసియర్ మరియు బెటర్ ఈ ఏడాది తమ ఉద్యోగులను భారీగా తగ్గించుకున్న కొన్ని టెక్ కంపెనీలు. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రపంచవ్యాప్తంగా 342 టెక్ కంపెనీలు/స్టార్టప్‌ల నుంచి 43,000 కంటే ఎక్కువ మంది కార్మికులు తొలగించబడ్డారు. ఇందులో 13 శాతానికి పైగా భారతదేశానికి చెందినవారు.ఈ మేరకు తొలగింపులను ట్రాక్ చేసే వెబ్‌సైట్ లేఆఫ్స్.ఫై తాజా డేటా వెల్లడించింది.

భారతదేశంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి 25,000 కంటే ఎక్కువ మంది స్టార్టప్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంవత్సరం 11,500 కంటే ఎక్కువ మంది తొలగించబడ్డారు.

భారతదేశంలో తొలగింపులు చూస్తే.. అన్ అకాడమీ 1,150 ఉద్యోగులు, బైజూస్ 550మంది.. వేదాంతులో 624 మంది, ఓలా దాదాపు 500, హెల్త్‌కేర్ స్టార్టప్ ఎంఫైన్ 600, మరియు ప్రీ-ఓన్డ్ కార్ల ప్లాట్‌ఫారమ్ కార్స్ 24 600 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇతర భారతీయ స్టార్టప్‌లు యునికార్న్‌లు మీషో, ఎమ్‌పిఎల్, ట్రెల్ మరియు బ్లింకిట్ లు కూడా ఈ తొలగింపు జాబితాలో ఉన్నాయి.

-లక్ష మంది ఉద్యోగుల తొలగింపు

ఇక ప్రపంచప్రఖ్యాత అమెజాన్ కూడా ఏకంగా లక్ష మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు లక్షమందిపై వేటు వేసినట్లు చెబుతున్నారు. సంస్థలో మొత్తం 15 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో లక్ష మందిని తొలగించినట్లుగా పేర్కొన్నారు. సిబ్బందిని తగ్గించడంతోపాటు వారిని నియమించుకోవడాన్ని తగ్గిస్తే మంచిదని అమెజాన్ పేర్కొంది. ఇక గత ఏడాది ఇదే అమెజాన్ 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. అవసరమైనప్పుడు పండుగల వేళ భారీగా ఉద్యోగులను నియమించి.. అవసరం తీరాక తొలగించడం అమెజాన్ నైజం.

ఈ సంస్థ నే కాదు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తొలగింపుల ప్రక్రియ మొదలైంది. అమెరికా కంటే భారత్ లోనే తక్కువ తొలగింపులు ఉన్నాయి. మనకంటే అగ్రరాజ్యంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధిని కోల్పోతున్నారు.