Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఒళ్లు విరుచుకున్నారా? ఇంత భారీగా ఐపీఎస్ బదిలీనా?

By:  Tupaki Desk   |   25 Dec 2021 11:02 AM IST
కేసీఆర్ ఒళ్లు విరుచుకున్నారా? ఇంత భారీగా ఐపీఎస్ బదిలీనా?
X
సంప్రదాయాల్ని సింఫుల్ గా పక్కన పెట్టేసే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే. మైకు పట్టుకున్నంతనే ఆయన చెప్పే మాటల్ని విన్నంతనే.. వావ్.. ఎంతటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి దొరికారన్న భావన కలుగుతుంది. ఇన్ని మాటలు మాట్లాడిన ఆయన గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో సెక్రటేరియట్ కు ఎనిమిది సార్లు కూడా వెళ్లని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరే అన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు వెళ్లాలా? ఆయన ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియట్ కాదా? అంటూ మాట్లాడే ఆయన మాటలకు పలువురు విస్మయాన్ని వ్యక్తం చేశారు.

నిజానికి అదొక్కటే కాదు.. సాధారణంగా ఐపీఎస్ లు.. ఐపీఎస్ అధికారుల్ని రెండేళ్లకు ఒకసారి.. కాదనుకుంటే మూడేళ్లకు ఒకసారి బదిలీ చేయటం సర్వసాధారణం. పరిపాలనలో వేగాన్ని పెంచటంతో పాటు.. ఒకే పోస్టులో ఎక్కువ కాలం ఉంచటం.. అధికారుల పని తీరును మందగించేలా చేస్తుందన్న తీరుకు భిన్నంగా ఏళ్లకు ఏళ్లుగా ఒకే పోస్టులో ఉంచే విషయంలో సీఎం కేసీఆర్ ట్రాక్ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేరన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడి దాకానో ఎందుకు రాచకొండ సీపీగా వ్యవహరిస్తున్న మహేశ్ భగవత్ ను రికార్డు స్థాయిలో నాలుగేళ్లు దాటి పోయినా ఆయన్నుఆ పోస్టు నుంచి బదిలీ చేయకుండా కొనసాగిస్తున్నారు.

మరీ..మహేశ్ భగవత్ అంత కాకున్నా.. ఉంచాల్సిన దాని కంటే ఎక్కువ కాలం ఉంచేసిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని క్రిస్మస్ వేడుకకు సరిగ్గా కొన్ని గంటల ముందు బదిలీ నిర్ణయం తీసుకొని హాట్ టాపిక్ గా మారారు. తాజాగా 30 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసిన ఉదంతాన్ని చూస్తే.. చాలా కాలానికి సీఎం కేసీఆర్ ఒళ్లు విరుచుకున్నట్లుగా చెప్పాలి. పలువురు సీనియర్ అధికారుల్ని మార్పులు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా చూస్తే.. ఇటీవల కాలంలో ఇంత భారీగా బదిలీలు ఇదేనని చెప్పాలి.

హైదరాబాద్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న అంజనీ కుమార్ స్థానంలో సీనియర్ అధికారి సీవీ ఆనంద్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో అంజనీ కుమార్ ను ఏసీబీ డీజీగా ఎంపిక చేశారు. అదే సమయంలో ఏసీబీ డైరెక్టర్ గా శిఖా గోయల్ ను ఎంపిక చేశారు. హైదరాబాద్ లో పని చేసి జిల్లాలకు పోస్టింగ్ ల మీద వెళ్లి ఐపీఎస్ లను తాజా బదిలీల్లో హైదరాబాద్ మహానగరానికి తీసుకొచ్చేశారు. దీర్ఘకాలంగా ఒకే పోస్టులో ఉన్న అధికారులకు స్థాన చలనం కలిగించారని చెప్పాలి. అదే సమయంలో జిల్లాల ఎస్పీలను సైతం భారీగా మార్పులు చేశారు.

తాజాగా చేసిన బదిలీల్ని చూస్తే..

- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- ఏసీబీ డీజీ అంజనీకుమార్
- ఏసీబీ డైరెక్టర్ శిఖా గోయల్
- హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్) ఏఅర్ శ్రీనివాస్
- హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్
- హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీ విశ్వప్రసాద్
- సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి
- హైదరాబాద్ కార్ హెడ్ క్వాటర్ జాయింట్ సీపీ కార్తికేయ
- సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్
- హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్
- మాదాపూర్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
- బాలానగర్ డీసీపీగా సందీప్ గొనె
- శంషాబాద్ డీసీపీ జగదీష్ రెడ్డి
- హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి
- హైదరాబాద్ సీసీఎస్‌ డీసీపీ గజరావు భూపాల్
- హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ 1 ప్రకాష్ రెడ్డి

జిల్లాల్లో జరిగిన బదిలీలు..

- నల్గొండ ఎస్పీ రామ రాజేశ్వరి
- సిద్దిపేట్ సీపీ శ్వేత
- మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
- వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
- నిజామాబాద్ సీపీ నాగరాజు
- అదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి,
- మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్
- ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్
- నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్
- నాగర్ కర్నూల్ ఎస్పీ మనోహర్
- కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
- జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి
- జనగాం డీసీపీ సీతారామ్
- నారాయణ్‌పేట్‌ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు