Begin typing your search above and press return to search.

వైసీపీ తీరుతో లాభపడుతున్న టీడీపీ: ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   17 Feb 2021 4:00 PM IST
వైసీపీ తీరుతో లాభపడుతున్న టీడీపీ: ఎందుకంటే..?
X
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి రెబెల్స్ షాకులు ఇస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ జెండా మోసిన కొందరు నేతలు పంచాయతీ ఎన్నికల్లోనైనా అవకాశం వస్తుందని చూశారు. కానీ కొందరికి అధికార వైసీపీ టికెట్ రాకపోయేసరికి తీవ్ర నిరాశ చెందారు. ముఖ్యంగా మంత్రులు ఇలాఖలోనే కొందరు అభ్యర్థులు తమకు టికెట్ ఇవ్వకపోయేసరికి స్వతంత్రంగా గెలిచి నిరూపించుకుంటున్నారు. అయితే అంతకుముందు దూరం పెట్టిన ఆ నేతలను గెలిచిన తరువాత అక్కున చేర్చుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం మళ్లీ వైసీపీలోకి వెళ్లకుండా అలాగే ఉండిపోతున్నాురు. రాయలసీమలో జరుగుతున్న ఈ పరిస్థితి గురించి విశ్లేషిద్దాం.

ప్రకాశం జిల్లాలోని మంత్రులు బాలినేని శ్రీనివారెడ్డి, ఆదిమూలపు సురేష్ లతో పాటు దర్శి, కనిగిరి, గిద్దలూరు, కందుకూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు రెబల్స్ బెడద ఉంది. జిల్లాలోని 1018 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రెండు విడుతల్లో అధికార పార్టీ రెండుగా చీలి ఎక్కవ చోట్ల రెబెల్స్ విజయం సాధించారు. దీంతో గెలిచిన వాళ్లూ మావాళ్లే అని మంత్రులు అనుకుంటున్నారట.

రాయలసీమలోని కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్, నియోజకవర్గ ఇన్ చార్జి కోట్ల హర్షవర్దన్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. ఈ విభేదాలు పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపాయి. కోట్ల హర్షవర్దన్ రెడ్డి తన అనుచరులకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో రెబెల్స్ గా పోటీ చేయించారు. దీంతో కొందరు గెలుపొందారు. అయితే 33 చోట్ల మాత్రమే వైసీపీ జెండా ఎగురగా 19 చోట్ల టీడీపీ పాగా వేసింది. ఇక వీరి మధ్య విభేదాలతో కోడుమూరు మేజర్ పంచాయితీ టీడీపీ ఖాతాలోకి వెళ్లడం గమనార్హం.

వైసీపీలో విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అవి బయటపడే అవకాశం ఉందని కొందరు సీనియర్ నాయకులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే అవేమీ స్థానిక నేతలు పట్టించుకోలేదు. దీంతో గ్రామాల్లోనూ పార్టీ రెండుగా చీలడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు వెళ్తారోనని చర్చించుకుంటున్నారు.