Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ కు షాకిస్తున్న అసంతృప్తులు

By:  Tupaki Desk   |   15 Sep 2018 8:57 AM GMT
టీఆర్ ఎస్ కు షాకిస్తున్న అసంతృప్తులు
X
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడం.. అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా 105మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగిపోయింది. టీఆర్ ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలందరూ ఇప్పుడు ప్రత్యామ్మాయంగా కాంగ్రెస్ టికెట్ కోసమే ప్రయత్నాలు చేస్తుండడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం కేసీఆర్ ప్రకటించిన 105 మంది జాబితాలో పలు మార్పులు - చేర్పులు చేయాలని మంత్రి కేటీఆర్ పట్టుబడుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం మార్చడానికి ఇష్టపడడం లేదని టీఆర్ ఎస్ వర్గాల నుంచి వార్తలు లీకవుతున్నాయి. దీంతో అసంతృప్తులందరూ ఇప్పుడు కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలస వెళ్లడానికి రెడీ అవుతున్నారట..

శుక్రవారం మాజీ మంత్రి - ప్రస్తుత సీనియర్ టీఆర్ ఎస్ నేత జీ. గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసి తాను కాంగ్రెస్ లోకి వస్తానని.. టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. రేవంత్ రెడ్డిపై పోటీచేస్తానని.. కోడంగల్ టికెట్ ఇవ్వాలని కోరినా తనకు టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వలేదని ఆయన మనస్థాపం చెంది కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు.

కానీ రేవంత్ రెడ్డిపై ఆర్థిక - ప్రజల అండదండలున్న నరేందర్ రెడ్డిని నిలబెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో అలక వహించిన గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరి కోడంగల్ ఎలాగూ రేవంత్ రెడ్డి ఉండడంతో తనకు తాండూర్ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని చర్చలు జరుపుతున్నారట..

ఇక శుక్రవారం టీఆర్ ఎస్ కు మరో షాక్ తగిలింది. నిజామాబాద్ కు చెందిన టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తనకు టీఆర్ ఎస్ టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెంది రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి జైలుకు వెళ్లిన తనను టీఆర్ ఎస్ నిర్లక్ష్యం చేసిందని.. 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోలేదని.. అందుకే ఆ పార్టీ వీడుతున్నట్టు ఆరోపించారు. ఈయన నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ లోకి జంప్ చేసినట్టు తెలిసింది.

ఇటీవలే టీఆర్ ఎస్ పై తిరుగుబాటు చేసిన కొండా సురేఖ కూడా కాంగ్రెస్ లో చేరి వరంగల్ తూర్పునుంచి బరిలోకి దిగడానికి నిర్ణయించుకున్నారట.. ఇలా టీఆర్ఎస్ అసంతృప్తులు.. ప్రతిపక్ష కాంగ్రెస్ గూటికి వరుసగా చేరుతుండడం గులాబీ పార్టీని కలవరపెడుతోంది. టీఆర్ ఎస్ అసంతృప్తిలు బరిలో ఉంటే అది పార్టీకి నష్టమని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.