Begin typing your search above and press return to search.

బీజేపీకీ తప్పని అసమ్మతి!

By:  Tupaki Desk   |   11 Nov 2018 8:56 AM GMT
బీజేపీకీ తప్పని అసమ్మతి!
X
బీజేపీలో అసమ్మతి రాజుకుంది. ఇప్పటి వరకు పార్టీలో కష్టపడి పనిచేసిన వారినే పక్కనబెట్టి కొత్త వ్యక్తులకు టిక్కెట్టు కేటాయింపు జరగడంపై ఆ పార్టీ నేతలు రగిలిపోతున్నారు. తెలంగాణా కొద్దో గొప్పో ఉన్న పార్టీని అంటిపెట్టుకున్న ఉన్న వారికే ఇచ్చే గౌరవం ఇదేనా అన్ని ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాలలో సగం సీట్లలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.

నిర్మల్ లో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మల్లికార్జున రెడ్డికి పార్టీ టిక్కెట్టు ఈ సారి దక్కుతుందని ఆశపడ్డారు. కానీ, స్వర్ణారెడ్డికి కేటాయించడంతో, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో మల్లికార్జునరెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆసిఫాబాద్ లోనూ ఇదే సీన్ రిపీటయ్యింది. తనకే టిక్కెట్టు ఇస్తారని ధీమాతో ఉన్న జడ్పీటీసీ రామ్ నాయక్ కు బదులుగా కొత్తగా పార్టీ చేరిన ఆత్మారం నాయక్ కు సీటు కేటాయించారు. బోధన్ లో కూడా ఇదే జరిగింది. మంచిర్యాల, చెన్నూరు సీట్లకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. రేపోమాపో హైదరాబాద్ లో జరుగనున్న సమావేశంలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.

ఈ క్రమంలో మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ముల్కల మల్లారెడ్డికి ఈ సారి మొండిచేయి చూపించే అవకాశాలు కనబడుతున్నాయి. అయినా, ప్రయత్నాలు మానుకోని ఆయన హైదరాబాద్ నేతల చుట్టూ తిరుగుతన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నారై ఎరవెల్లి రఘునాథ్ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారట. ఇప్పటి వరకు ప్రకటించిన రెండు జాబితాల్లో మంచిర్యాల పేరు ప్రకటించలేదు. రాజకీయంగా బలమైన సామాజిక వర్గం రఘునాథ్ కు ఉంది. సీట్లు వ్యవహారంపై చర్చలు జరుగుతుండగానే, ఈయన మంచిర్యాలలో సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. దీంతో ఖంగుతిన్న మల్లారెడ్డి వెంటనే హైదరాబాద్ లో వాలిపోయారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్టు ఎలా ఇస్తారని ఆయన హైదరాబాద్‌ పెద్దలను ప్రశిస్తున్నప్పటికీ, సరైన సమాధానం లేదని తెలిసింది. మరోవైపు రెండురోజుల్లో ప్రకటించే తుది జాబితాలో తన అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని రఘునాథ్‌ చెబుతున్నారు.

ఇక, చెన్నూరు సీటు కోసం పోటీ పడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాంవేణుతో పాటు 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన అందుగుల శ్రీనివాస్‌ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ టికెట్టు హామీతోనే అందుగుల శ్రీనివాస్‌ బీజేపీలో చేరినా, 2014 ఎన్నికల్లో అవకాశం రాలేదు. ఈసారి వస్తుందని ఆశించిన ఆయనకు రాంవేణు నుంచి పోటీ ఎదురవుతోంది. పార్టీ జిల్లా కమిటీ అందుగుల శ్రీనివాస్‌ పేరును ప్రతిపాదించినప్పటికీ, జిల్లా అధ్యక్షుడే టికెట్టు కోసం చమటోడుస్తున్న తరుణంలో చెన్నూరు సీటు గురించి అడిగేవారు లేరు.

తెలంగాణలో అంతంతమాత్రంగానే ఉన్న బీజేపీకి - అసమ్మతి పెద్ద మైనస్ గా మారింది. పార్టీ మారే వారి సంఖ్య పెరుగుతుండటంతో, అధిష్ఠానం కూడా నిలవరించలేకపోతుంది. ఇది ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపి - అభ్యర్థుల గెలుపు ఆశల గల్లంతవడానికి దోహదపడుతుందేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.