Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోటకు బీటలు తప్పనట్లేనా?

By:  Tupaki Desk   |   14 Sep 2019 2:30 PM GMT
కేసీఆర్ కోటకు బీటలు తప్పనట్లేనా?
X
అందుకే అంటారా? ఏ విషయంలోనూ అతి అంతమంచిది కాదని. అధికారం చేతిలో ఉన్నప్పటికీ.. అదెప్పటికి శాశ్వితం కాదన్న నిజాన్ని తెలిసి తెలివిగా మసులుకున్న వారికి ఎలాంటి తిప్పలు ఎదురుకావు. అధికారం ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువమందిని దగ్గరకు తీసుకున్న వారు చరిత్రలో నిలిచిపోతుంటారు. ప్రజా నేతగా ఆదరణ సొంతం చేసుకుంటారు.

అందుకు భిన్నంగా తనదైన ప్రపంచంలో ఉంటూ.. తనకు నచ్చిన వారిని మాత్రమే దగ్గరకు తీసుకునే వారికి తిప్పలు తప్పవు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ అంటే పార్టీలోని నేతలకే కాదు.. బయట పెద్ద.. పెద్ద మాటలు మాట్లాడే కొడుకు కేటీఆర్ సైతం.. తండ్రి తప్పుల్ని చెప్పే ధైర్యం చేయరని.. ఆ మాటకు వస్తే.. ఎదుట కూర్చోవటానికి కూడా ఇష్టపడరని చెబుతారు. తాను చెప్పిందే జరగాలన్న పంతం కేసీఆర్ లో ఎక్కువని.. అదే తాజా దుస్థితికి కారణంగా చెబుతారు.

బలం చేతిలో ఉన్నప్పుడు దానికి ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయరు. తాజాగా కేసీఆర్ విషయంలో జరిగింది కూడా ఇదే. మొన్నటి వరకూ పట్టు సడలకుండా లాక్కొచ్చిన కేసీఆర్ కు.. ఇప్పుడు కట్టు తెగటం.. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం.. కేంద్రం కన్నేయటం లాంటి కష్టాలు వరుస పెట్టి రావటంతో ఇప్పుడు ఆయన కిందామీదా పడుతున్నారు. ఎంత పెద్ద లీడర్ అయినప్పటికీ.. అసమ్మతిని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు.

తన చుట్టూ పెట్టుకున్న నేతలందరూ సామాన్యులేమీ కాదని.. ప్రజల్లో తనకున్న ఆదరాభిమానాల వల్లే.. తానేం చేసినా కుక్కిన పేనుల్లా ఉన్నారన్న విషయాన్ని కేసీఆర్ మిస్ అవుతున్నట్లు చెప్పక తప్పదు. తనకు ప్రజల అండ శ్రీరామరక్ష అని.. అదే మాత్రం తగ్గినా చెలరేగిపోతారన్న విషయాన్ని మరవకూడదు. అదే సమయంలో తెలంగాణలో తాను తప్పించి మరో అప్షన్ లేదన్న దానికి భిన్నంగా తనకు తానే బీజేపీ బలపడేందుకు అవకాశం ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ ను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయకుంటే బీజేపీకి మౌకా దక్కేది కాదు. కాంగ్రెస్ ను ఖతం చేసిన కేసీఆర్ ఇప్పుడు తాను చేసిన తప్పునకు చింతిస్తూ ఉండొచ్చు.

తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడితే.. అదే సమయంలో బీజేపీ బలపడింది. ఒకరికి అవకాశం మిస్ అయితే.. మరొకరికి ఆ అవకాశం దక్కుతుందన్న ప్రాధమిక సూత్రాన్ని కేసీఆర్ మిస్ అయ్యారు. ఆ విషయాన్ని స్పష్టం చేసేలా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలుగా చెప్పాలి. వాస్తవ పరిస్థితుల్ని మరిచి.. భారీ అంచనాలకు పోయి.. లేని తిప్పలు కొని తెచ్చుకున్నారు కేసీఆర్.

సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ తర్వాత అయినా పాలనాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే..తాజాగా నెలకొన్న పరిస్థితి ఎదురయ్యేది కాదని చెప్పక తప్పదు. తనకు విధేయుడిగా ఉండే హరీశ్ ను దూరాలోచనతో ఆయన ప్రాధాన్యతను తగ్గించటం.. ఉద్యమ సమయంలో తన వెంటే నడిచిన పలువురు నేతల్ని వదిలేసి.. బీటీ బ్యాచ్ ను ప్రోత్సహించటం టీఆర్ఎస్ లో మొదట్నించి ఉంటున్న నేతలకు అస్సలు నచ్చటం లేదు. అదును కోసం చూస్తున్న వారంతా.. ఇప్పుడొచ్చిన అవకాశంతో చెలరేగిపోతున్నారని చెప్పక తప్పదు.

మోడీషాల కన్ను తెలంగాణ మీద పడటంతో ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు కేసీఆర్. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న వాస్తవాన్ని కేసీఆర్ గుర్తించటంలో మిస్ అయ్యారు. తనకు సన్నిహితంగా ఉండే ఈటలను దూరం చేసే ప్రయత్నం చేయటం.. దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మీడియా ఎదుట గులాబీ పార్టీకి ఓనర్లం తామేనని చెప్పటంతో కలకలం మొదలైంది. తన స్వభావానికి విరుద్ధంగా.. తోక జాడించిన వారు ఎవరైనా సరే.. మొదలుకంటే కట్ చేసే తీరుకు భిన్నంగా కామ్ గా ఉండటంతో సారుకు సైతం పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించారు మిగిలిన నేతలు.

అంతే.. ఎవరికి వారు గళం విప్పటం మొదలెట్టారు. గతంలో ఎవరైనా పార్టీకి.. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా మాట్లాడితే వారి నోరు మూతపడేలా చేసేవారు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఫోన్ చేసి బుజ్జగించటం చేస్తున్నారు. అగ్రెసివ్ గా ఉండే తీరుకు భిన్నంగా ఢిఫెన్స్ లో పడినట్లుగా వ్యవహరిస్తున్న తీరు టీఆర్ఎస్ నేతలు తమ డిమాండ్లను తెర మీదకు తీసుకురావటానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. అదే ఇప్పుడు.. గులాబీ బాస్ కు కొత్త కష్టాన్ని తీసుకురావటమే కాదు.. కోటకు బీటలు వారేలా చేస్తుందని చెప్పక తప్పదు.