Begin typing your search above and press return to search.

యాదాద్రిలో పెరిగిన లడ్డూ ధర..కారణమిదే

By:  Tupaki Desk   |   11 Dec 2021 1:30 AM GMT
యాదాద్రిలో పెరిగిన లడ్డూ ధర..కారణమిదే
X
ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మండిపోతోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క కేంద్రం, మరో పక్క రాష్ట్రం..ఇలా వేటికవే రేట్లు పెంచుకుంటూ పోవడం...ఒకవేళ కేంద్రం తగ్గించినా...కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోవడంతో సామాన్యులపై పెనుభారం పడుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించే భక్తులపై కూడా పడింది. తాజాగా యాదాద్రిలో ప్రసాదం లడ్డూ ధర పెంచాలని నిర్ణయించారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, పులిహోర ధరలను పెంచుతూ ఆలయ ఈవో ఎన్‌ గీత ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీంతోపాటు ఉద్యోగులకు పెంచిన పీఆర్సీతో ఆలయానికి నెలకు రూ.2 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఈ కారణాలతోనే అనివార్య పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు.

గతంలో 100 గ్రాముల స్వామివారి లడ్డూ రూ.20 ఉండగా, రూ.10 పెంచి మొత్తం రూ.30గా కొత్త ధరను నిర్ణయించారు. అభిషేకం (500 గ్రాముల) లడ్డూ రూ.100 నుంచి రూ.150 పెరిగింది. ఇక, సువర్ణ పుష్పార్చన రూ.516 నుంచి రూ.600కు పెరిగింది. వేద ఆశీర్వచనం రూ.516 నుంచి రూ.600కు, నిత్యకల్యాణం రూ.1,250 ఉండగా రూ.1,500కు పెంచారు. స్వామివారి నిజాభిషేకం రూ.500 నుంచి రూ.800, సహస్ర నామార్చన రూ.216 నుంచి రూ.300కు, లక్ష పుష్పార్చన రూ.2,116 ఉండగా రూ.2,500, స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు రూ.500 ఉండగా రూ.700కు, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో) రూ.500 ఉండగా రూ.800కు పెంచారు. వీటితోపాటు ఆలయంలో భక్తులతో నిర్వహించే వివిధ రకాల పూజల ధరలు కూడా పెంచామని, భక్తులు ఈ కొత్త ధరలను గమనించాలని ఈవో గీత కోరారు.