Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగుల్లో తాజా భయాలకు కారణమదేనా?

By:  Tupaki Desk   |   8 Nov 2022 2:30 AM GMT
ఐటీ ఉద్యోగుల్లో తాజా భయాలకు కారణమదేనా?
X
ఎక్కువ జీతాలు, బోనస్‌లు, వారాంతాల్లో సెలవులు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకునే విధానం, విదేశాల్లోనూ ఉండే అవకాశం ఇలా వివిధ కారణాలతో ఐటీ ఉద్యోగాల వైపే ఎక్కువ మంది యువత ఆసక్తి చూపుతున్నారు. లేట్‌ట్స్, పని ఒత్తిడి ఉంటాయని తెలిసినప్పటికీ వీటితో పోలిస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉండటంతో ఐటీ ఉద్యోగాలే వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

అయితే ఇప్పుడు ఐటీ ఉద్యోగులంతా భయాందోళనల్లో ఉన్నారని అంటున్నారు. కోవిడ్‌ సమయం తర్వాత కంపెనీలు చాలామందిని నియమించుకున్నాయి. కోవిడ్‌ విజృంభణ తగ్గడంతో ఐటీ కంపెనీలు మళ్లీ యధావిధిగా ప్రాజెక్టులతో కళకళలాడాయి. దీంతో భారీగా ఉద్యోగులను నియమించుకున్నాయి.

ఐటీ కంపెనీల నుంచి మంచి అవకాశాలు రావడంతో చాలామంది ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ పెట్టి ఉద్యోగాల్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్థిక మాంద్యం ప్రభావం, ఉక్రెయిన్‌-రష్యా వార్, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తదితర కారణాలతో మళ్లీ ఐటీ కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధించడానికి చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కోవిడ్‌ సమయం ముగిశాక భారీ స్థాయిలో రిక్రూట్‌ చేసుకున్న ఉద్యోగులందరినీ తొలగించే పనులకు శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రొఫైల్స్‌ను కంపెనీలు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాయి. దీంతో ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉద్యోగులు దక్కించుకున్నవారు తమ ఉద్యోగాలు పోతాయోమనని భయపడుతున్నారు.

ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌తో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినవారు తొలగించే జాబితాలో ముందు ఉండటం వారిని కలవరపరుస్తోంది. పైగా కేపీఎంజీ వంటి ప్రముఖ సంస్థలకు కొత్త ఉద్యోగుల బ్యాక్‌గ్రౌండ్‌ను తనిఖీ చేసే బాధ్యతలను అప్పగిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సైతం కంపెనీలు తనిఖీ చేయిస్తున్నాయి.

కేపీఎంజీ తనిఖీల్లో తప్పుడు పద్ధతులు లేదా మార్గాల ద్వారా కంపెనీలోకి ప్రవేశించిన వారిని వెంటనే ఐటీ కంపెనీలు తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇలా చాలా మంది ఉద్యోగాలు కొల్పోయినట్లు సమాచారం.

మరోవైపు కరోనా సమయం తర్వాత కొంతమంది హెచ్‌ఆర్‌ మేనేజర్లు సైతం తప్పుడు పద్ధతులు అవలంభించినట్టు చెబుతున్నారు. ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్, తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలిచ్చి.. వారి నుంచి రెండు నెలల జీతాన్ని కమీషన్‌గా తీసుకున్నట్టు పేర్కొంటున్నారు. ఇప్పుడు వీరిపైన కూడా ఐటీ కంపెనీలు ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో వారంతా నోటీస్‌ పీరియడ్‌ ఇచ్చి వేరే కంపెనీలకు మారిపోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే మూన్‌లైటింగ్‌ (ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం) వ్యవహారంలో ఐటీ కంపెనీలు చాలా సీరియస్‌గా ఉన్నాయి. ఇలా మూన్‌లైటింగ్‌ చేసేవారిని తొలగిస్తున్నాయి. విప్రో, ఇన్పోసిస్, డెలాయిట్‌ వంటి కంపెనీలన్నీ మూన్‌లైటింగ్‌ విధానంపై ఆగ్రహంగా ఉన్నాయి. ఎవరైనా తమ కంపెనీల ఉద్యోగులు మూన్‌లైటింగ్‌ చేస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని ఇప్పటికే ఆయా కంపెనీలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగుల బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ చేయించే పనిలో పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.