Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌ కు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారింది ఎవ‌రంటే

By:  Tupaki Desk   |   19 April 2018 5:30 PM GMT
ఉత్త‌మ్‌ కు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారింది ఎవ‌రంటే
X
టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సొంత పార్టీ నుంచే స‌హ‌కారం అంద‌డం లేదా? ఇటు పార్టీ బ‌లోపేతం అటు పార్టీపై పట్టు సాధించి - తనదైన ముద్ర వేసేందుకు ఆయ‌న చేప‌ట్టిన యాత్ర ఫ‌లితం ఇవ్వ‌డం లేదా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఉత్త‌మ్ చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్రకు ఎప్పటి కప్పుడు బ్రేకులు పడుతున్న నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. మూడు దశల్లో జరిగిన బస్సుయాత్ర నిరంతరాయంగా జరగలేదు. వివిధ కారణాలతో యాత్రలను వాయిదా వేస్తున్నారు. దీంతో కార్యకర్తలు - నాయకులు పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్త‌మ్‌ కు పార్టీపై ప‌ట్టు త‌ప్పుతోంద‌ని కొంద‌రు అంటుంటే కావాల‌నే కొంద‌రు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఇంకొంద‌రు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఉత్త‌మ్ రాష్ట్రవ్యాప్త బ‌స్సుయాత్ర‌ను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. బస్సుయాత్ర సన్నాహక సమావేశంలో కూడా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తర్వాత యాత్ర చేపట్టాలని సూచించినా...ఉత్తమ్‌ ఏకపక్షంగా ప్రకటించారని విమర్శలొచ్చాయి. అనంత‌రం కాంగ్రెస్‌ పార్టీ రెండోవిడత బస్సుయాత్రను ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించింది. ఈ బస్సుయాత్రను పదిరోజుల్లో 17 నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేశారు. కాగా రెండో విడత బస్సుయాత్రకు రెండు మూడుసార్లు బ్రేకులు పడ్డాయి. పదిరోజులు జరగాల్సిన బస్సుయాత్ర వారానికే ముగిసింది. ఆ తర్వాత నాలుగైదు రోజులకు తిరిగి చేపట్టారు. మలివిడత బస్సుయాత్రలో స్టేషన్‌ ఘన్‌ పూర్‌ - వరంగల్‌ తూర్పు - వర్ధన్నపేట్‌ మూడు బహిరంగసభలు వాయిదా పడ్డాయి. ఇలా వాయిదా ప‌డేందుకు ప‌లు కార‌ణాలున్నాయ‌ని అంటున్నారు. బహిరంగసభల నిర్వహణ భారీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో నేతలు ముందుకు రాకపోవడం - ఉత్తమ్‌ వ్యతిరేక గ్రూపులు సహకరిం చకపోవడంతో ఈ బస్సుయాత్రకు అడుగడుగునా బ్రేకులు పడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడో దశను నాలుగు రోజులు నిర్వహించి మళ్లీ వాయిదా వేశారు. ఈ విధంగా బస్సుయాత్ర వాయిదా వేయడంతో గ్రూప్‌ ల మధ్య అంతర్గత కుమ్ములాట తారాస్థాయికి చేరిందని ఆ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బస్సుయాత్ర నేతల మధ్య ఐక్యత లేకపోగా మరింత దూరం పెంచే ప్రమాదం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మూడు దశల్లో కొనసాగిన బస్సుయాత్ర ఉత్తమ్‌ అనుకూల గ్రూపులు - ఇటీవల ఆయన గ్రూపులో కొత్తగా చేరిన నేతల సహకారంతోనే జరిగిందని ఆ వర్గాల్లో చర్చ మొదలైంది. ఏ నాయకుడైతే బహిరంగ సభ నిర్వహణకు ముందుకు వచ్చారో దానికి అనుగుణంగానే టీపీసీసీ నాయకత్వం రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసినట్టు తెలిసింది. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో పాదయాత్రకు సర్వం సిద్ధం చేసుకుంటున్న పార్టీ నేతలు మల్లు భట్టి విక్రమార్క - డికె అరుణ - పొన్నం ప్రభాకర్‌ - రేవంత్‌ రెడ్డిలు బస్సుయాత్రలకు హాజరు అవుతున్నా, వారి భాగస్వామ్యం అంతంత మాత్రమేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వారంతా మొదటి నుంచి బస్సుయాత్రల కంటే పాదయాత్రల వైపే మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. ఇంతేకాకుండా ఆయా నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం, సమన్వయం లేకపోవడమేనని కాంగ్రెస్‌ నేతల్లో చర్చ జరుగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో సభలు పెడితే జనసమీకరణ కష్టమవుతుందని భావించి అక్కడ వాయిదా వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో ప్రజా చైతన్య యాత్ర చేయాల్సి ఉంది. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే డికె అరుణ వంటి నేతల సహకారంతోనే బస్సుయాత్ర విజయవంతమవుతుందని, వారితో చర్చించిన తర్వాతనే నాలుగో విడత బస్సుయాత్ర చేపడతారా? లేకపోతే వారికి పాదయాత్రలకు అనుమతి ఇచ్చి బస్సుయాత్రకు బ్రేకులు వేస్తారా?అనేది వేచి చూడాల్సిందేన‌ని అంటున్నారు. ఉత్త‌మ్ ల‌క్ష్యాలు భారీగా ఉంటే..కాంగ్రెస్ స‌హ‌కారం నామ‌మాత్రంగా ఉంద‌ని చెప్తున్నారు.