Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ రఘు వ్యూహం ఏంటి...దూకుడు వెనుక రీజ‌న్ ఉందా..?

By:  Tupaki Desk   |   18 Dec 2019 2:02 PM GMT
వైసీపీ ఎంపీ రఘు వ్యూహం ఏంటి...దూకుడు వెనుక రీజ‌న్ ఉందా..?
X
ఔను! ఆయ‌నలో దూకుడు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఒక‌వైపు పార్టీ అధిష్టాన‌మే పిలిచి మ‌రీ మొట్టికాయ‌లు వేసి నా.. ఆయ‌న లైట్‌ గా తీసుకున్నారు. త‌న‌కు తానే రాజును, బంటును అని తీర్మానం చేసుకున్నారు. ఆయ‌నే వైసీపీ నాయ‌కుడు - ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు. ఎవ‌రేమ‌ను కున్నా.. ఎవ‌రేం చేసినా.. త‌న దారి త‌న‌దేన‌ని ఆయ‌న చెప్పుకొంటున్నారు. అలానే చేస్తున్నారు. వైసీపీలో ఇటీవ‌ల కొన్ని క‌ట్టుబాట్లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ముఖ్యంగా ఎంపీలు ఎవ‌రైనా కూడా కేంద్రంలోని పెద్ద‌ల‌తో నేరుగా ట‌చ్‌ లోకి రావొద్ద‌ని - కేంద్రానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని స్వ‌యంగా జ‌గ‌నే ఆదేశాలు జారి చేశారు.

అదే స‌మ‌యంలో రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై కూడా ఎవ‌రికి వారు గా కాకుండా పార్ల‌మెంటులో మాట్లాడాల్సి వ‌చ్చిన‌ప్పుడు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - పార్ల‌మెంట‌రీ వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డితో సంప్ర‌దించాకే నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న సూటిగా చెప్పారు. అయితే, ఈ సూచ‌న‌లు - స‌ల‌హాల‌ను ఎంపీ ర‌ఘు ఏమాత్రం పట్టించుకోవ‌డం లేదు. నేరుగా పార్ల‌మెంటులో బీజేపీ కార్యాల‌యంలోకి వెళ్ల‌డం - నేరుగా కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తుండ‌డం, వారితో క‌ర‌చాల‌నం చేస్తుండ‌డం - అదేవిధంగా పార్ల‌మెంటు ఎంపీల‌కు తానే స్వ‌యంగా భారీగా విందు ఇవ్వ‌డం వంటివి ఇటీవ‌ల కాలంలో రఘును జాతీయ నేతా అనే రేంజ్‌ కు తీసుకు వెళ్లిపోయాయి.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు.. జ‌గ‌న్ అంటే.. ఆయ‌న మాటంటే.. సొంత కుటుంబంలోని నాయ‌కులు వైవీ సుబ్బారెడ్డి వంటివారు కూడా భ‌య‌ప‌డిపోతారే! చెప్పిన‌ట్టు వింటారే! అలాంటి ది ర‌ఘు ఎందుకు ఇలా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు ? అనే విష‌యంపై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి వెలుగు చూసింది. వైఎస్ ఆత్మ‌గా జాతీయ స్థాయిలో ప్ర‌చారం పొందిన కేవీపీ రామ‌చంద్ర‌రావు స్వ‌యానా ర‌ఘుకు వియ్యంకుడు. ఈయ‌న ఆధ్వ‌ర్యంలోనే ఇటీవ‌ల భారీగా విందును కూడా ఇచ్చారు. ఇక‌, కేవీపీకి జగ‌న్ ఫ్యామిలీకి మ‌ధ్య కూడా మంచి సంబంధం ఉంది.

ఈ నేప‌థ్యంలో కేవీపీ అండ చూసుకునే ఏం జ‌రిగినా.. ఫ‌ర్లేదు. మా వియ్యంకుడు చూసుకుంటాడు. అనే ధీమాతోనే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రో కోణం.. ఏంటంటే..ఏమైనా తేడా వ‌స్తే.. ఎలాగూ బీజేపీ ఉంది క‌దా..! అనే ధీమా కూడా ర‌ఘులో క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ఏదేమైనా.. ర‌ఘు దూకుడు ఇలానే కొన‌సాగితే.. వ‌చ్చే నాలుగైదు మాసాల్లోనే వైసీపీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.