Begin typing your search above and press return to search.

సబ్బం... ఇలా గడుపుకోవాలి పబ్బం

By:  Tupaki Desk   |   4 Jan 2019 11:06 AM IST
సబ్బం... ఇలా గడుపుకోవాలి పబ్బం
X
సబ్బం హరి. విశాఖపట్నం మాజీ మేయర్. అనకాపల్లి లోక్‌ సభ మాజీ సభ్యుడు. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీలోనూ చేరకుండా మిన్నకున్నారు. అయితే, ఈ నాలుగున్నరేళ్లలోనూ తనకు అవసరం కలిగినప్పుడల్లా ఏదో పార్టీకి అనుకూలంగానో - వ్యతిరేకంగానో విలేకరుల సమావేశం పెట్టి నేను ఉన్నాను అని విశాఖపట్నం ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఆ పార్టీ అలాగ... ఈ పార్టీ ఇలాగ అంటూ అంచనాలు - విశ్లేషణలు మాత్రం విరివిగా చేస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. రానున్న ఎన్నికలకు ముందు తాను ఏ పార్టీలో చేరతానో వెల్లడిస్తానన్నారు. అంతే కాదు... ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయని ప్రకటించారు. అంతే కాదు... జగన్ - జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కలిస్తే వారిద్దరి విజయం నల్లేరు మీద నడకే అని కూడా అన్నారు. ఈ ప్రకటనపై ఒక్క విశాఖ జిల్లాలోనే కాదు... మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా నవ్వులు విరజిమ్మాయి.

ఇలాంటి ప్రకటన చేయడానికి మాజీ ఎంపీలు అవసరం లేదని - చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారనే వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఈ ప్రకటన వెనుక ఉన్న రహస్యం మాత్రం వేరే ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. సబ్బం హరి ప్రకటన తర్వాత వై.ఎస్.ఆర్ - కాంగ్రెస్ నుంచి కాని - జనసేన నుంచి కాని తనకు ఆహ్వనం వస్తుందని సబ్బం హరి ఆశించారని అంటున్నారు. అయితే ఆయన ఊహించినట్లుగా జరగకపోవడంతో తన పబ్బం ఎలా గడుస్తుందా అని సబ్బం ఆలోచన పడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండు పార్టీల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఇక తానే ఎదురెళ్లాలని భావించిన సబ్బం హరి రెండు రోజల క్రితం అమరావతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ్ని కలుసుకుని పార్టీలో చేరతానంటూ తన అభిమతం చెప్పుకున్నారంటున్నారు. జిల్లా నాయకులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం చెబుతానని చంద్రబాబు నాయుడు అన్నట్లు సమాచారం. ఈలోగా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు విశాఖ పర్యటనపై విమర్శలు గుప్పిస్తున్నారు సబ్బం హరి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కెసీఆర్‌ ను - జగన్‌ ను - పవన్ కల్యాణ్ ను విమర్శించి తెలుగుదేశం పార్టీలో తన పబ్బం గడుపుకోవాలని సబ్బం అనుకుంటున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. మొత్తానికి ఇన్ని చేసి పార్టీలో చేరినా నిరంతరం వివాదాలతో అట్టుడుకుతున్న విశాఖ తెలుగుదేశం పార్టీలో సబ్బం మనగలుగుతారా అన్నది పెద్ద అన్నది పెద్ద ప్రశ్నే అంటున్నారు.