Begin typing your search above and press return to search.

పీతల సుజాత ఊస్టింగ్ కు ఆ ఇద్దరే కారణమా?

By:  Tupaki Desk   |   20 April 2017 10:19 AM GMT
పీతల సుజాత ఊస్టింగ్ కు ఆ ఇద్దరే కారణమా?
X
ఏపీ మంత్రివర్గంలో పదవులు పోగొట్టుకున్నవారిలో కొందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకొందరు కూడా తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. కానీ... పీతల సుజాత మాత్రం పల్లెత్తి మాటనకుండా చంద్రబాబు నిర్ణయానికి తలూపారు. అందుకు కారణం ఉందట. చంద్రబాబు ఆమెను తొలగించడానికి ముందే పిలిచి తొలగింపునకు దారితీసిన పరిస్థితులను వివరించారట. ఓ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల ఒత్తిడి కారణంగా చంద్రబాబు అలా వ్యవహరించక తప్పలేదని టీడీపీ నేతలు అంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే అయిన పీతల సుజాత రాజకీయ జీవితం ఎత్తుపల్లాలను చూసింది. 2004లో మొదటిసారిగా ఆచంట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన సుజాత అప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది.. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పోటీ చేసే అవకాశం ఆమెకు దక్కలేదు. 2012లో జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర జరిగింది.. ఆ సందర్భంగా సుజాత అధినేత దృష్టిలో పడ్డారు. దాంతో 2014 ఎన్నికల్లో చింతలపూడి నుంచి పోటీ చేసే అవకాశం సుజాతకు లభించింది.. ఆ ఎన్నికల్లో సుజాత విజయం సాధించారు. ఆ తరువాత సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆమెకు మంత్రి పదవి కూడా లభించింది.

అప్పటి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయట. మహిళ కావడంతో ఆమె జిల్లాలో పెద్దగా డామినేట్ చేసేవారు కాదు. దాంతో మిగతా కొందరు నేతలు నిత్యం ఆమె నియోజకవర్గంలో వేలు పెట్టడమే కాకుండా చంద్రబాబుకు ఆమెపై ఏదో ఒక ఫిర్యాదు చేసేవారట. పీతల సుజాత చింతలపూడి నియోజకవర్గానికి వచ్చిన దగ్గర్నుంచి ఓ సామాజికవర్గం నేతలు ఆమెనే టార్గెట్‌ చేశారట! వీరు కాకుండా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌... ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా సుజాత విషయంలో యాంటీగానే ఉన్నారట.

చింతలపూడి అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవిని తన వర్గానికి చెందిన మనిషికి కట్టబెట్టడానికి మాగంటి బాబు తీవ్రంగా ప్రయత్నించారట! అయితే దానికి సుజాత చెక్‌ పెట్టడంతో ఆయన ప్రయత్నాలు వీగిపోయాయట! తర్వాత టీడీపీ జిల్లా యూత్‌ అధ్యక్షునిగా తన కుమారుడు రాంజీకి పట్టం కట్టించడానికి మాగంటి బాబు ప్రయత్నాలు చేశారట! అదే సమయంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన ఒక యువ నాయకునికి యూత్‌ పదవి ఇప్పించడానికి సుజాత ప్రయత్నించారట. ఇలా కొన్ని సంఘటనలు సుజాత-బాబు మధ్య అంతరాన్ని పెంచాయి. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయట.

ఇక దెందులూరు ఎమ్మెల్యే అయితే మొదటి నుంచి సుజాత అంటే గుర్రుగానే ఉన్నారని టాక్‌! తన నియోజకవర్గంలో ప్రభాకర్‌ వేలు పెట్టడాన్ని సుజాత సహించలేకపోయారు. ముఖ్యంగా తడికలపూడి సినిమా థియేటర్‌ ఓపెనింగ్‌ కు ఆమెకు తెలియకుండా చింతమనేని ప్రభాకర్‌ రావడం టీడీపీ వర్గాలలో చాలా కాలం హాట్‌ టాపిక్‌ గానే కొనసాగింది. అలా ప్రభాకర్‌ తోనూ ఆమెకు విభేదాలు కొనసాగాయి.

ఆమె పదవి పోవడం వెనుక ఓ బలమైన సామాజికవర్గం ప్రమేయం ఉందనేది చింతలపూడి నియోజకవర్గం ప్రజల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేయడానికి ఓ రోజు ముందు చంద్రబాబు స్వయంగా పీతల సుజాతను పిలిచి ఏ పరిస్థితులలో పదవి నుంచి తప్పిస్తున్నది ఆమెకు వివరించగా.. ఆమె చంద్రబాబు నిర్ణయానికి తలూపి .. తన నియోజకవర్గంలో ఇతరులు ఎలా జోక్యం చేసుకున్నారో, ఏ విధంగా తనను బద్నాం చేశారో చంద్రబాబుకు పూసగుచ్చినట్టు వివరించారట. దానికి చంద్రబాబు... నాకు అంతా తెలుసు.. అంతా నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారట. అలా మంత్రి పదవి పోయినా బాబు భరోసా ఇవ్వడంతో సుజాత కామ్ గా ఉన్నారని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/