Begin typing your search above and press return to search.

రెండు చోట్ల ప‌వ‌న్ పోటీ వెనుక లెక్కేంది?

By:  Tupaki Desk   |   19 March 2019 5:30 PM
రెండు చోట్ల ప‌వ‌న్ పోటీ వెనుక లెక్కేంది?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ నియోజ‌క‌వర్గం మీద స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ సాగిన అంచ‌నాల‌కు భిన్నంగా ఆయ‌న ఒక చోట నుంచి కాకుండా రెండు చోట్ల నుంచి పోటీ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌డిచిన కొంత‌కాలంగా విశాఖ జిల్లా గాజువాక నుంచి బ‌రిలోకి దిగుతార‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్నా.. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన భీమ‌వ‌రం మాట మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు చ‌ర్చ‌కు రాలేదు.

రెండు చోట్ల పోటీ చేయాల‌న్న ప‌వ‌న్ నిర్ణ‌యం వెనుక లాజిక్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రెండు స్థానాల నుంచి పోటీ చేయ‌టం ద్వారా ప‌వ‌న్ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నార‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది. బ‌ల‌మైన నేత‌లు ఎవ‌రూ రెండు చోట్ల పోటీ చేయాల‌ని అనుకోరు. కొద్ది మంది మాత్ర‌మే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. తాను ఒక ప్రాంతానికే ప‌రిమితం కాద‌ని.. ఏ ప్రాంతంలో అయినా ప్ర‌జ‌లు త‌న‌ను అక్కున చేర్చుకుంటార‌న్న సంకేతాల్ని ఇవ్వ‌టం కోసం కొన్నిసార్లు అధినేత‌లు పోటీ చేస్తుంటారు.

స్వ‌ర్గీయ నంద‌మూరి ఎన్టీఆర్ తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ప్పుడు మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. ఆయ‌న కోస్తా.. రాయ‌ల‌సీమ‌.. తెలంగాణ‌ల‌లో పోటీ చేశారు. కోస్తాలోని గుడివాడ‌.. రాయ‌ల‌సీమ‌లోని హిందూపురం.. తెలంగాణ‌లోని న‌ల్గొండ నుంచి పోటీ చేశారు. దీని ద్వారా ఆయ‌న చెప్ప‌ద‌లిచిన విష‌యం ఏమంటే.. త‌న‌ను ఏ ప్రాంతం వారైనా అక్కున చేర్చుకుంటార‌నే. ఆయ‌న అనుకున్న‌ట్లే.. 1985లో ఆయ‌న పోటీ చేసిన మూడుచోట్లలో ఎన్టీఆర్ ను గెలిపించారు. త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడించ‌టం వేరే సంగ‌తి.

త‌ర్వాత కాలంలో పార్టీ పెట్టిన చిరంజీవి.. రెండు చోట్ల పోటీ చేశారు. అందులో తిరుప‌తి రాయ‌ల‌సీమ‌కు చెందిన ప్రాంతం కాగా.. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన పాల‌కొల్లులో పోటీ చేశారు. ఈ సంద‌ర్భంగా పాల‌కొల్లులో ఓడిపోగా.. తిరుప‌తిలో విజ‌యం సాధించారు.

తాజాగా ప‌వ‌న్ పోటీని చూస్తే.. ఉత్త‌రాంధ్ర‌.. ఆ ప‌క్క‌నే ఉన్న గోదావ‌రి జిల్లాల్లో పోటీ చేయ‌టం విశేషం. ఆయ‌న వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది. రెండు చోట్ల పోటీ చేయ‌టం ద్వారా.. త‌న‌కు అన్నిప్రాంతాల్లో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని చెప్ప‌ట‌మే ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే.. ఎలాంటి రిస్క్ లేకుండా.. ప‌క్కాగా గెలిచే స్థానాల్ని చూసుకొని మ‌రీ ప‌వ‌న్ పోటీకి దిగ‌టం విశేషం. అలా కాకుండా రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం.. ఉత్త‌రాంధ్ర‌లోని గాజువాక నుంచి పోటీ చేస్తే బాగుండేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. చూసేందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్న ప‌వ‌న్‌.. వ్యూహాత్మ‌కంగా బ‌రిలోకి దిగార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.