Begin typing your search above and press return to search.

నిత్య వాయిదాల వెనుక అసలు కుట్ర వేరే!

By:  Tupaki Desk   |   5 April 2018 4:35 AM GMT
నిత్య వాయిదాల వెనుక అసలు కుట్ర వేరే!
X
పార్లమెంటు లో ఎలాంటి డ్రామాలు నడుస్తూ ఉన్నాయో దాదాపుగా నెలరోజుల నుంచి దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇవ్వడమూ.. అవి చర్చకు వచ్చే సమయానికి.. అసలు సభ జరిగే పరిస్థితులే లేకుండా... (?), అలా అభివర్ణించడానికి వీలుగా అన్నాడీఎంకే ఆందోళనలు చేయడమూ.. వాయిదా పడడమూ నిరంతరాయంగా జరుగుతూ వస్తోంది.

ప్రధానంగా అవిశ్వాసం ఒక్కటే తెరమీద కనిపిస్తున్నది కాబట్టి.. అవిశ్వాసం అంటే కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నదని.. మోడీ ది పిరికితనపు చర్య అని పలు విమర్శలు కూడా పుట్టుకొస్తున్నాయి. అయితే ఎన్డీయే కూటమిగా కాకుండా.. భాజపాకే సభలో విశ్వాసం నెగ్గడానికి సరిపడా పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో తాము అవిశ్వాసానికి ఎందుకు భయపడుతామని? చర్చ జరగడాన్నే తాము కూడా కోరుకుంటున్నామని భాజపా శ్రేణులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. పూర్తి బలం సొంతంగా ఉన్నప్పుడు వారెందుకు భయపడాలి? ఈ వాదన నిజమే కదా? అని అనుకునే వారు కూడా ఉన్నారు.

అయితే ఇప్పుడు కొన్ని కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. జాతికి అవసరమైన అనేక అంశాలు పెండింగ్ లో పడిపోతున్నాయని.. సభను పొడిగించి అయినా కీలకాంశాలపై చర్చ జరిగేలాచూడాలని విపక్ష పార్టీలు 13 కలిసి లోక్ సభ - రాజ్యసభ లసారథులు సుమిత్రా మహాజన్ - వెంకయ్యనాయుడు లను కలిసి విన్నవనించిన నేపథ్యంలో కొత్త సంగతులు తెలుస్తున్నాయి.

అవిశ్వాసం గురించిన భయం మాత్రమే కాదు.. మోడీ సర్కారుకు మరిన్ని భయాలు కూడా ఉన్నట్లుగా ఇప్పుడు కొత్త ప్రచారం ప్రారంభం అయింది. విపక్షాలు ప్రస్తావించిన అంశాల్లో ఏపీ ప్రత్యేకహోదాతో పాటు - కావేరీ బోర్డు - బ్యాంకింగ్ కుంభకోణం వంటివి ఉన్నాయి. అయితే.. బ్యాంకింగ్ కుంభకోణాలు వంటి అంశాలు చర్చకు రాకూడదని ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా ఒక వాదన వినిపిస్తోంది.

మోడీ సర్కారు దృష్టిలో అవిశ్వాసం అనేది చాలా చిన్న అంశం. ఒకసారి చర్చకు అనుమతిస్తే.. కేవలం కొన్ని గంటల వ్యవధిలో అది వీగిపోతుంది. మోడీ సర్కారు గెలిచినట్లు పండగ చేసుకోవచ్చు. కానీ.. దానివలన సభ సజావుగా సాగిందంటే మాత్రం.. బ్యాంకింగ్ కుంభకోణాలు వంటివి కూడా చర్చకు వస్తాయి. అప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇరుకున పడుతుంది. అందుకే అసలే అంశమూ చర్చకు రాకుండా వారు డ్రామాలాడుతున్నారు... అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే సభను సాగనివ్వకపోవడానికి అసలు భయం అవిశ్వాసం కాదని.. ప్రభుత్వానికి ఇతర భయాలు ఉన్నాయని అర్థమవుతోంది.