Begin typing your search above and press return to search.

బాబుపై మోడీ ప‌గే.. ఏపీకి శాప‌మా?

By:  Tupaki Desk   |   9 March 2018 3:30 PM IST
బాబుపై మోడీ ప‌గే.. ఏపీకి శాప‌మా?
X
విన‌యంగా ఉంటాడు. ఒద్దిక‌గా ఉంటాడు. విధేయుడిగా వ్య‌వ‌హ‌రిస్తాడు. అన్నింటికి మించి మాట జార‌డు. పెద్ద మ‌నిషిలా క‌నిపిస్తాడు. మ‌రిన్ని ల‌క్ష‌ణాలు ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంటే ప్ర‌ధాని మోడీకి ఎందుకు కోపం? ఆయ‌నంటే చాలు చిరాకు ప‌డిపోవ‌ట‌మే కాదు.. కీల‌క‌మైన ఫైళ్ల విష‌యంలోనూ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తారెందుకు? ఏపీ ప‌ట్ల అంతులేని నిర్ద‌య‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న మోడీ కోపానికి అస‌లు కార‌ణం ఏమిటి? చంద్ర‌బాబు మీద ఉన్న కోప‌మే.. ఏపీ కొంప ముంచుతుందా? బాబు పొడ‌గిట్ట‌ని మోడీ తీరే ఏపీ ప్ర‌జ‌లకు శాపంగా మారుతోందా? అంటే.. అవున‌నే చెబుతారు కొంద‌రు.

మాట వ‌ర‌స‌కు చెప్పిన‌ట్లు కాకుండా ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తారు. అప్పుడెప్పుడో జ‌రిగి పోయిన‌వి కాసేపు ప‌క్క‌న పెట్టి.. ఇటీవ‌ల కాలంలో జ‌రిగిన ఒక ఉదంతాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తుంటారు. మోడీ స‌ర్కారులో కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఉమాభార‌తికి.. ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఈ కార‌ణంతోనే పోల‌వ‌రం ప్రాజెక్టు ఫైలును ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ప‌రుగులు తీసేలా చేశారని చెబుతారు. అయితే.. ఆమె ప్ర‌య‌త్నాల్ని కొర్రీల రూపంలో నిలువ‌రించిన‌ట్లుగా ఆమె గ‌తంలో కొంద‌రు స‌న్నిహితుల ద‌గ్గ‌ర ప్ర‌స్తావించిన‌ట్లు చెబుతారు.

పోల‌వ‌రం విష‌యంలో ఎందుకంత తొంద‌ర‌? ప‌్రాజెక్టు విష‌యంలో కొర్రీలు పెట్టాల‌ని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌య‌మే స్వ‌యంగా చెప్ప‌టం నాకు ఆశ్చ‌ర్యంగా అనిపించింది? చ‌ంద్ర‌బాబు విష‌యంలో పీఎంవో ఎందుకిలా వ్య‌వ‌హ‌రిస్తుందో అర్థం కావ‌టం లేదంటూ త‌న‌కు స‌న్నిహితులైన కొంద‌రు నేత‌ల ద‌గ్గ‌ర ఉమాభార‌తి చెప్పిన‌ట్లు చెబుతారు.

అంతేనా.. ఏపీ స‌ర్కారు నుంచి ప్ర‌తిపాద‌న‌ల్ని క‌నీసం ప‌రిశీలించ‌టానికి సైతం ప్ర‌ధాని ఇష్ట‌ప‌డ‌ర‌ని.. ఇలాంటివి చాలానే పంపుతూనే ఉంటారంటూ మోడీ చేసిన ప్రైవేటు వ్యాఖ్య‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఇంత‌కీ బాబు అంటే మోడీకి ఎందుకంత గుర్రు? వారి మ‌ధ్య‌న అభిప్రాయ‌బేధాలు ఎందుకు వ‌చ్చాయి? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకోవాలంటే దాదాపు ప‌ద‌హారేళ్లు వెన‌క్కి వెళ్లాల్సిందేన‌ని చెబుతారు. వాజ్ పేయ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఎన్టీయే 1లోనూ చంద్ర‌బాబు భాగ‌స్వామిగా ఉండ‌టం తెలిసిందే. గుజ‌రాత్ అల్ల‌ర్ల నేప‌థ్యంలో 2002లో ఏప్రిల్ లో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న మోడీని ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేసిన తొలి నేత‌గా చంద్ర‌బాబును చెబుతారు.

మోడీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన తొలి నాయ‌కుడు చంద్ర‌బాబేన‌ని చెబుతారు. ఇదే.. బాబు మీద మోడీ ఆగ్ర‌హానికి కార‌ణంగా చెబుతారు. గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో చంద్ర‌బాబు అనుస‌రించిన ముక్కుసూటిత‌నం ప్ర‌ధాని మోడీ మ‌ర్చిపోయి ఉండ‌రని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ చెబుతారు. ఇదే కార‌ణంగా ప్ర‌ధాని అయ్యాక బాబు మీద అంత‌కంతా తీర్చుకోవ‌టానికి కార‌ణమ‌న్న అభిప్రాయం ఉంది.

వాజ్ పేయ్ స‌ర్కారులో 28 మంది ఎంపీల‌తో టీడీపీ బ‌ల‌మైన ఎన్డీయే భాగ‌స్వామిగా ఉంది. గుజ‌రాత్ అల్ల‌ర్లు జ‌రిగిన‌ప్పుడు అక్క‌డి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని.. ఆ టైంలో అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌ట‌మంటే మానవ విషాదాన్నిసొమ్ము చేసుకోవ‌ట‌మేన‌ని టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానించింది. బాబు ఒత్తిడి కార‌ణంగా మోడీని తొల‌గించేందుకు వాజ్ పేయ్ ప్ర‌య‌త్నించారు. అద్వానీ ఎంట్రీ ఇవ్వ‌టంతో ఆ ప్ర‌య‌త్నం ఆగింది. ఇదే.. అంశంపై బాబుకు న‌చ్చ‌జెప్పేందుకు అప్ప‌టి పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి విజ‌య్ గోయెల్ స్వ‌యంగా హైద‌రాబాద్ కు వ‌చ్చి మాట్లాడారు. వాజ్ పేయ్ ఫోన్లో మాట్లాడారు.

అంతేకాదు 2003లో బాబు స‌ర్కారు ఉన్న వేళ‌.. హైద‌రాబాద్ లో జ‌రిగే వినాయ‌క నిమ‌జ్జ‌నానికి మోడీ రావాల‌న్న ప్ర‌య‌త్నం చేస్తే.. బాబుగ‌ట్టిగా అడ్డుకోవ‌టంతో ఆఖ‌రి నిమిషంలో మోడీ హైద‌రాబాద్ టూర్ క్యాన్సిల్ అయ్యింద‌ని చెబుతారు. ఇలాంటివెన్నో విష‌యాలు మోడీ మ‌న‌సులో ఉన్నాయ‌ని.. అదే బాబుపైనా.. ఏపీపైనా చూపిస్తున్నార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు.

ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత బాబును చెక్ పెట్టేందుకు వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని మోడీ వ‌దులుకోలేద‌ని చెబుతారు. సింగ‌పూర్ వ్య‌వ‌స్థాప‌కుడు లీ కువాన్ యెవ్ క‌న్నుమూసిన‌ప్పుడు బాబు అక్క‌డికి వెళ్లాల‌నుకున్నారు. కానీ.. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌టంతో ఆయ‌న సింగ‌పూర్ కు వెళ్ల‌లేక‌పోయారు. చివ‌ర‌కు ప్ర‌ధాని మోడీ టీంలోనూ స‌భ్యుడిగా ఆయ‌న్ను సింగ‌పూర్ తీసుకెళ్ల‌లేద‌ని చెబుతారు. త‌న‌కు స‌మానంగా బాబు సింగ‌పూర్ రావ‌టానికి మోడీ ఇష్ట‌ప‌డ‌లేద‌ని చెబుతారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బాబు సైతం మోడీ ఇగోను ప‌లుమార్లు ట‌చ్ చేశార‌ని చెబుతారు. ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఒక‌సారి ఆయ‌న స‌మ‌క్షంలోనే.. తాను ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ఉన్న‌ప్పుడు అనుస‌రించిన విధానాన్ని గుజ‌రాత్ సీఎంగా ఉన్న మోడీ అనుస‌రించార‌ని చెప్పుకోవ‌టం తెలిసిందే. ఇలాంటివి మోడీకి బాబు మీద ఉన్న చిరాకును మ‌రింత పెంచిన‌ట్లుగా చెబుతారు. బాబు మాట‌లు.. చేత‌లు క‌లిసి ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో మోడీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించేలా చేసిన‌ట్లుగా చెబుతారు. మోడీ.. బాబు మ‌ధ్య లొల్లి సంగ‌తి త‌ర్వాత ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు తీవ్ర విఘాతం జ‌రిగిన‌ట్లుగా చెప్ప‌క త్ప‌దు.