Begin typing your search above and press return to search.

న‌ల్ల కుబేరుల‌కు భయం..సామాన్యులకు అభయం

By:  Tupaki Desk   |   9 Nov 2016 10:57 AM IST
న‌ల్ల కుబేరుల‌కు భయం..సామాన్యులకు అభయం
X
పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... న‌ల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించారు. నిన్న రాత్రి వెలువ‌డిన కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో న‌ల్ల కుబేరులంతా త‌మ సొమ్మును కాల్చేయాల్సిందే. లేదంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి ప‌ట్టుబ‌డిపోవాల్సిందే. ఈ నిర్ణ‌యంతో సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందికర‌మైన వాతావ‌ర‌ణం లేద‌నే చెప్పాలి. హఠాత్తుగా కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించి, ఆ వెనువెంట‌నే ఏమాత్రం స‌మ‌యం ఇవ్వ‌కుండా కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలో స‌ద‌రు నిర్ణ‌యాన్ని అమ‌ల్లోకి తీసుకురావ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో కాస్తంత గంద‌ర‌గోళం నెల‌కొన్న మాట వాస్త‌వ‌మే. అయితే వాస్త‌వ ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న వారు... మోదీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు.

అంతేకాకుండా ప్ర‌సార మాధ్య‌మాల్లో త‌మ వ‌ద్ద ఉన్న రూ.500 - రూ.1,000 నోట్ల‌ను ఎలా మార్చుకోవాలో కూడా భారీ ఎత్తున ప్ర‌చారం చేయ‌డంతో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న సందిగ్ధ‌త ప‌టాపంచ‌లైపోయింది. ఈ నిర్ణ‌యంతో ముప్పంతా... న‌ల్ల కుబేరుల‌కే. ఎందుకంటే... ప్ర‌భుత్వానికి లెక్క‌లు చెప్ప‌కుండా అక్ర‌మంగా సంపాదించిన న‌ల్ల‌ధ‌నాన్ని రూ.500 - రూ.1,000 నోట్ల‌లోనే వారు దాచుకున్నారు. ఈ న‌ల్ల ధ‌నాన్ని బ‌య‌ట‌కు రాబ‌ట్టేందుకే మోదీ ప్ర‌భుత్వం పెద్ద నోట్ల ర‌ద్దు వంటి సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఈ నిర్ణ‌యం ప్ర‌కారం అంద‌రి వ‌ద్ద ఉన్న రూ.500 - రూ.1,000 నోట్లు బ్యాంకుల‌కు చేరాల్సిందే. నిజాయ‌తీగా క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న వారు నిర్భ‌యంగా త‌మ వ‌ద్ద ఉన్న పెద్ద నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటారు. అయితే వచ్చిన ఇబ్బందంతా న‌ల్ల కుబేరులే. కోట్లాది రూపాయ‌ల న‌ల్ల‌ధ‌నాన్ని పోగేసుకున్న న‌ల్ల కుబేరులు... త‌మ వ‌ద్ద నోట్ల‌ను ద‌క్కించుకోవాలంటే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందే. ఇలా డిపాజిట్ చేసే వ్య‌క్తులు ఆయా బ్యాంకుల వ‌ద్ద త‌మ ఐడెంటిటీని చూపించాల్సి ఉంది. ఫ‌లితంగా లెక్క‌లు చూప‌ని న‌ల్ల‌ధ‌నాన్ని వెల్ల‌డించే వారు ఇట్టే ప‌ట్టుబ‌డిపోతారు. ఇక ప్ర‌భుత్వానికి భ‌య‌ప‌డి త‌మ డ‌బ్బును దాచుకునేందుకే మొగ్గు చూపే వారికి ఈ నిర్ణ‌యం భారీ షాకే ఇవ్వ‌నుంది. ఎందుకంటే... డిసెంబ‌ర్ 30లోగా త‌మ వ‌ద్ద ఉన్న రూ.500 - రూ.1,000 నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. ఆ త‌ర్వాత ఆర్బీఐ నిర్దేశించిన కొన్ని ప్ర‌దేశాల్లో మాత్ర‌మే ఈ నోట్ల మార్పిడికి అవ‌కాశం ఉంటుంది. అంటే నిర్దేశిత గ‌డువులోగా బ్యాంకుల‌కు చేర‌ని రూ.500 - రూ.1,000 నోట్లు చిత్తు కాగితాల‌తో స‌మాన‌మ‌న్న మాట‌. ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో సామాన్యులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే న‌ల్ల కుబేరులు ఆశ‌పెడితే.. వారి డ‌బ్బును మార్చేందుకు మాత్రం మొగ్గు చూపొద్ద‌ని కూడా వారు సామాన్య జ‌నానికి హెచ్చరిక‌లు జారీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా పెద్ద ఇబ్బందులేమీ కూడా లేవ‌ని ప్ర‌భుత్వం విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించింది. నోట్ల ర‌ద్దుతో నేడు బ్యాంకుల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... నేడు - రేపు ఏటీఎంలు కూడా ప‌నిచేయ‌వ‌ని ప్ర‌క‌టించింది. అయితే ఆన్‌ లైన్ న‌గ‌దు చెల్లింపులు - క్రెడిట్‌ - డెబిట్ కార్డు చెల్లింపుల‌పై ఎలాంటి నిషేదం లేద‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌భుత్వ వ‌ర్గాలు సూచిస్తున్నాయి. అంటే నిన్న రాత్రి వెలువ‌డ్డ నిర్ణ‌యంతో సామాన్యుల‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని, కేవ‌లం న‌ల్ల కుబేరుల‌ను క‌లుగులో నుంచి బ‌య‌ట‌కు లాగేందుకే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/