Begin typing your search above and press return to search.

ప్రధానిని కేసీఆర్‌ ఎందుకు కలవటం లేదు?

By:  Tupaki Desk   |   12 Jun 2015 10:12 AM IST
ప్రధానిని కేసీఆర్‌ ఎందుకు కలవటం లేదు?
X
లోపల ఎంత ఆవేశం ఉన్నా.. కొన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తుంటారు. తన రాజకీయ ప్రత్యర్థుల గురించి తీవ్రస్థాయిలో విరుచుకుపడే కేసీఆర్‌.. అదే సమయంలో తనకు అవసరం ఉన్న వారి గురించి పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడరు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీని ఫాసిస్టుగా అభివర్ణించి.. ఏకవచనంలో ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఆయన.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం తెలిసిందే. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సందర్భంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రస్తావన వచ్చిన సమయంలో.. ''ప్రధానమంత్రి మోడీగారు'' అంటూ మాట్లాడటమే దీనికి నిదర్శనం.

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేరని చెబుతున్న కేసీఆర్‌.. తమ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించటం లేదని.. తాము ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయలేదంటూ వాదిస్తున్న కేసీఆర్‌ అండ్‌ కో.. ప్రధానమంత్రితో భేటీ ఎందుకు కావటం లేదన్నది ఆసక్తికరం.

రెండు తెలుగు రాష్ట్ర ప్రనభుత్వాల మధ్య తీవ్రస్థాయిలో పోరాటం జరుగుతున్న సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి తన వాదనను ప్రధానమంత్రి మోడీకి గంటకు పైగా వివరిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఢిల్లీ ముఖం చూసేందుకు ఇష్టపడటం లేదు. నిజానికి కేసీఆర్‌ ఇష్టపడటం కంటే కూడా.. మోడీ నుంచి సానుకూల స్పందన రాకపోవటమే కారణంగా చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికీ ఆయన గుర్రుగా ఉన్నారని చెబుతారు.

ఈ కారణం చేతనే.. ప్రధాని హోదాలో ఉన్న మోడీతో స్నేహహస్తం చాచేందుకు కేసీఆర్‌ ఎప్పుడో సిద్ధమైనా.. మోడీ నుంచి సానుకూల సంకేతం రావటం లేదని చెబుతున్నారు. దీనికి తోడు.. కేంద్రంలో తాము భాగస్వామ్యం అయ్యే విషయంలో కేసీఆర్‌కు ఆసక్తి ఉన్నప్పటికీ.. తన అనవసర వ్యాఖ్యలతో కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఏర్పడటంతో ఎంపీ కవిత కారణం అయ్యారంటారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ భాగస్వామ్యం కావాలని భావిస్తే.. అందుకు భిన్నంగా.. తనకు మంత్రి పదవి విషయంలో మోడీ ఆఫర్‌ చేస్తే తాను తీసుకుంటానని కవిత చేసిన వ్యాఖ్యలు బీజేపీ అగ్రనేతలకు అగ్రహం తెప్పించాయని చెబుతారు.

ఓవైపు తండ్రి బీజేపీతో దోస్తీ కోరుకుంటుంటే.. మరోవైపు ఆయన బిడ్డ అదే పార్టీ నేతల పరపతి దెబ్బ తినేలా వ్యాఖ్యలుచేయటం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా కేసీఆర్‌కు.. కేంద్రానికి మధ్య సత్‌సంబంధాలు లేని కారణంగా ఆయన కేంద్రం దగ్గకు వెళ్లటం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే.. సానుకూల వాతావరణం ఏర్పడేందుకు వీలుగా.. ఆయన ఆచితూచి మాట్లాడుతూ బీజేపీతో తాను స్నేహం కోరుకుంటున్న విషయాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేస్తున్నారు.