Begin typing your search above and press return to search.

లోకేశ్ చాంబర్‌ ను ఆ మంత్రి వద్దనడానికి కారణం ఇదేనట

By:  Tupaki Desk   |   13 Jun 2019 1:05 PM IST
లోకేశ్ చాంబర్‌ ను ఆ మంత్రి వద్దనడానికి కారణం ఇదేనట
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రివర్గంలో కొలువుతీరిన మంత్రులకు గత సోమవారం చాంబర్లు(పేషీ) కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఆంధ్రప్రదేశ్ గనులు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తనకు కేటాయించిన చాంబర్‌ ను మార్చుకున్నారు. ముందుగా ఆయనకు కేటాయించిన చాంబర్‌ ను వద్దనుకున్న ఆయన.. సచివాలయంలోని 3వ బ్లాక్‌ లో ఉన్న 203 రూమ్‌ ను తన ఛాంబర్‌గా ఎంచుకున్నారు. గురువారం ఆయన తన ఛాంబర్‌ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

ఈ పరిణామం తర్వాత పెద్దిరెడ్డి ఎందుకు తన చాంబర్‌ ను మార్చుకున్నారు...? దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయి..? ఎన్నో హంగలు, విశాలంగా ఉన్న చాంబర్ ఎందుకు కాదనుకున్నారు..? అని అందరిలో అనుమానాలు తలెత్తాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. మొదట పెద్దిరెడ్డికి కేటాయించిన చాంబర్‌ కు వాస్తు సమస్యలు ఉండడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చాంబర్‌ ను పలువురు పండితులతో చూయించిన ఏపీ మంత్రి.. వారి సూచన మేరకు దీనిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.

వాస్తవానికి ఇదే చాంబర్‌ లో వాస్తు మార్పులు చేస్తే పర్లేదని కూడా సదరు పండితులు సూచించారట. అయితే, దీనిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపారని, ఇందుకు ఆయన అంగీకరించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనే కాదు.. సహచర మంత్రులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చాంబర్ మార్పులు సాధ్యమయ్యే పని కాదని మంత్రికి సలహా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు, ఇలాంటి పనులు ఏమైనా చేస్తే ఆదిలోనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఆస్కారం కూడా ఉండడంతోనే వేరే చాంబర్‌ లోకి వెళ్లారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

పెద్దిరెడ్డి వద్దనుకున్న చాంబర్‌ లోనే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన బాధ్యతలు నిర్వర్తించే చాంబర్ కావడంతో దీనిని ఎంతో విశాలంగా, అత్యాధునికంగా తయారు చేయించారు. దీనికి ఎన్నో హంగులు జోడించారు. మంత్రిగా ఆయన ఇక్కడి నుంచే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడే ఎంతో మందితో సమావేశమయ్యారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.