Begin typing your search above and press return to search.

జుక‌ర్‌ బ‌ర్గ్ దానం వెనుక మ‌ర్మం ఇది

By:  Tupaki Desk   |   5 Dec 2015 5:32 AM GMT
జుక‌ర్‌ బ‌ర్గ్ దానం వెనుక మ‌ర్మం ఇది
X
ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు, నవ యువ కుబేరుడు మార్క్‌ జుకర్‌ బర్క్‌ తండ్రి అయిన సంతోషంలో త‌ను, త‌న భార్య‌కు ఫేస్‌ బుక్ ద్వారా చెందిన 99 శాతం షేర్లను దానం చేస్తున్నట్టు ప్రకటించారు.జుకర్‌ బర్గ్‌ తన భార్య ప్రిసిలా చాన్‌ తో కలిసి ఏర్పాటు చేసిన 'చాన్‌ జుకర్‌ బర్గ్‌ ఇనిషియేటివ్‌ స ద్వారా ఈ సొమ్మును ఖ‌ర్చు చేయ‌నున్నట్లు వివ‌రించారు.ఈ నూతన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు నిధులు అందజేస్తామని, వచ్చే వందేళ్లలో దాదాపు అన్ని రోగాల నివారణ - చికిత్స చేస్తామని ప్రకటించారు. వ్యక్తిగత ఆన్‌ లైన్‌ విద్యా కార్యక్రమాలకు కూడా నిధులు అందజేస్తామని జుకర్‌ బర్గ్ తెలిపారు.

అయితే జుక‌ర్‌ బ‌ర్గ్ దాతృత్వాన్ని వేనోళ్ల పొగుడుతున్న సంద‌ర్భంలోనే...ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు సైతం అదే రీతిలో వ‌స్తున్నాయి. పన్నులు ఎగ‌వేసేందుకే ఈ ఎత్తుగ‌డ వేశార‌ని ప‌లువురు విమ‌ర్శ‌కులు ఆరోపిస్తున్నారు. మిగ‌తా వారికంటే భిన్నంగా లిమిటెడ్‌ లియబిలిటీ కంపెనీ (ఎల్‌ ఎల్‌ సీ)ని ఏర్పాటుచేసి త‌ద్వారా జుకర్‌ బర్గ్‌ తన విరాళం ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ‌టం ద్వారా..ఆ సొమ్మును ప్రైవేటు కార్పొరేషన్‌ లలో మదుపు చేసేందుకు, సహాయ కార్యక్రమాలకు నిధులు అందించేందుకు, రాజకీయాలలో పాల్గొనేందుకు పూర్తి స్వేచ్ఛ కలిగి ఉండ‌టంతో పాటు తాను దానం చేసిన షేర్ల పైన జుకర్‌ బర్గ్‌ పూర్తి నియంత్రణాధికారం కలిగి ఉంటారు.

నగదుకు బదులు షేర్లను దానం చేయాలనే జుకర్‌ బర్గ్‌ నిర్ణయాన్ని అమెరికా రచయిత రాబర్ట్‌ డబ్ల్యూ వుడ్‌ చాలా 'తెలివైన' నిర్ణయం అని ఎద్దేవా చేశారు. దీని ద్వారా పన్నుల్ని తప్పించుకోవడానికి జుకెర్‌ బ‌ర్గ్‌ కు మరింత ఎక్కువ అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయప‌డ్డారు. షేర్ల మార్కెట్‌ విలువ ప్రకారం పన్ను రాయితీలు లభిస్తాయి. దాదాపు తన షేర్లన్నింటినీ ఎల్‌ ఎల్‌ సీకి విరాళంగా ఇవ్వడం ద్వారా జుకర్‌ బర్గ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నులలో కనీసం 20 శాతం లాభం పొందాడని 'థింక్‌ ప్రోగ్రెస్‌'కు చెందిన ఎలైస్‌ ఓల్ స్టయిన్‌ రాశారు. అంతేకాదు, ఎల్‌ ఎల్‌ సీని ప్రారంభించడానికి జుకర్‌ బర్గ్‌ దంపతులకు ప్రేరణగా నిల్చిన చిన్నారి మ్యాక్స్‌ కు భవిష్యత్తులో తన తండ్రి నుంచి వారసత్వంగా అనివార్యంగా సంక్రమించే సంపదలపై అనేక మిలియన్ల డాలర్ల ఎస్టేట్‌ పన్నుల నుంచి కూడా మినహాయింపు అప్పుడే లభించిందని విశ్లేషించారు. నిజానికి, జుకర్‌ బర్గ్‌ ప్రకటించిన 'విరాళం' చారిటీ ముసుగులో సంపదను ఒక అకౌంట్‌ నుంచి పన్నులు లేని మరో అకౌంట్‌ కు బదిలీ చేయడమేనని వుడ్‌ వ్యాఖ్యానించారు. ఇలా పన్నులను ఎగవేసే వ్యూహం జుకర్‌బర్గ్‌కు కొత్తేమీ కాదని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. 2012లో ఫేస్‌ బుక్‌ ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)ను ప్రారంభించడం ద్వారా ఆయనకు 429 మిలియన్‌ డాలర్ల పన్ను రాయితీ లభించిందని, సింగిల్‌ ట్యాక్స్‌ బ్రేక్‌ పద్ధతిని అనుసరించడం ద్వారా ఫేస్‌ బుక్‌ కంపెనీ వందల మిలియన్ల డాలర్ల పన్ను రాయితీలు పొందిందని గ‌తం త‌వ్వుతున్నారు.

అయితే జుకర్‌ బర్గ్‌ తనను తాను సమర్థించుకుంటూ ఇది పన్ను ఎగవేత వ్యూహం కాదని స్ప‌ష్టం చేశారు.స‌మాజం నుంచి వ‌చ్చిన సంప‌దను తిరిగి స‌మాజం శ్రేయ‌స్సుకోస‌మే ఉప‌యోగించినా విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. మొత్తంగా ల‌క్ష‌ల కోట్ల సొమ్ములు పోగుప‌డినా పైసా దానం చేయ‌ని అంబానీలు - అదానీల కంటే 3ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు స‌మాజ హితం కోసం కేటాయించిన జుక‌ర్‌ బ‌ర్గ్ ఖ‌చ్చితంగా అభినంద‌నీయుడు. ఒక‌వేళ ఈ దాతృత్వం ద్వారా ప‌న్ను మిన‌హాయింపులు పొందినా కూడా! ఇంతకీ మేరేమంటారు?