Begin typing your search above and press return to search.

కేటీఆర్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల మ‌ర్మ‌మేందంటారు?

By:  Tupaki Desk   |   15 Sept 2018 11:12 AM IST
కేటీఆర్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల మ‌ర్మ‌మేందంటారు?
X
ఇటీవ‌ల ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌కు తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు క‌మ్ తాజా మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. కేటీఆర్ కు పెద్ద పీట వేస్తూ ఇస్తున్న ఈ ఇంట‌ర్వ్యూల క‌వ‌రేజీ వెనుక మ‌ర్మం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం ఉన్న‌వేళ‌.. అధికార‌ప‌క్షం కోరి ఎన్నిక‌ల‌కు వెళుతున్న స‌మ‌యంలో.. ఈ మొత్తానికి కార‌ణ‌మైన వ్య‌క్తి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌టం స‌ముచితంగా చెబుతారు. అలా చూస్తే.. కేసీఆర్ ఇంట‌ర్వ్యూలు భారీగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా కేసీఆర్ స్థానే.. కేటీఆర్ ప్రొజెక్ట్ కావ‌టం వెనుక అస‌లు కార‌ణం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుత తెలంగాణ ఎన్నిక‌లు మొత్తం కేటీఆర్ సెంట్రిక్ గా సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. క‌థ న‌డిపించేదంతా కేసీఆరే అయినా.. న‌డిచేది మొత్తం కేటీఆర్ కోస‌మేన‌న్న‌ట్లుగా తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో కేటీఆర్ కు ఎలాంటి పాత్రా లేకున్నా.. తెలంగాణ‌కు రాబోయే రోజుల్లో అంతా కేటీఆర్ చుట్టూనే తిరుగుతోంద‌న్న సంకేతాలు ఇచ్చేలా తాజా ఇంట‌ర్వ్యూలు ఉండ‌టం విశేషం.

సాధార‌ణంగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్న వేళ‌.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో కేసీఆర్ స‌ర్కారు సాధించిందేమిటి?. తాజా ల‌క్ష్యాలు ఏమిటి? ఎన్నిక‌ల వేళ అనుస‌రించే వ్యూహం ఏమిటి? ఇలాంటి ప్ర‌శ్న‌లెన్నో ఉంటాయి. వాటిని కేసీఆర్ నుంచి రాబ‌ట్ట‌టం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అందుకు భిన్నంగా.. కేటీఆర్ ను ప్ర‌ముఖంగా చూపిస్తూ ఇంట‌ర్వ్యూలు ప‌బ్లిష్ చేస్తున్న వైనం వెనుక పెద్ద క‌థే ఉందంటున్నారు.

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ప‌క్షంలో తొలుత కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినా.. కొద్ది కాలానికే కేటీఆర్ ను త‌న రాజ‌కీయ వార‌సుడిగా ప్ర‌క‌టిస్తూ.. ఆయ‌న ప‌ట్టాభిషేకం ఉంటుందంటున్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఎలా అయితే.. గెలుపు క్రెడిట్ కేటీఆర్ ఖాతాలో వేశారో.. అదే రీతిలోతాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు ఖాతా కేటీఆర్ ఖాతాలోకి బ‌దిలీ చేసేందుకు వీలుగా ఇప్ప‌టికే ఏర్పాట్లు షురూ అయిన‌ట్లుగా చెప్పాలి. ఈ క్ర‌మంలోనే కేటీఆర్ ను ప్ర‌ముఖంగా ప్రొజెక్ట్ చేసేలా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ప్లాన్ చేశార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే.. గ‌డిచిన మూడు రోజులుగా ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో కేటీఆర్ మాట‌ల‌కు దాదాపు ఫుల్ పేజీని (మొద‌టి పేజీని మిన‌హాయిస్తే) కేటాయిస్తున్న‌ట్లుగా చెప్పాలి. టీఆర్ఎస్‌కు గొంతుక కేసీఆర్ అయినా.. మారిన కాలానికి త‌గ్గ‌ట్లుగా తండ్రి స్థానాన్ని కొడుకు చేతుల్లోకి తీసుకుంటున్న వైనాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేయ‌టం కోస‌మే తాజా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.