Begin typing your search above and press return to search.

అధికారం కంటే డబ్బే ముఖ్యం

By:  Tupaki Desk   |   30 Dec 2015 10:30 PM GMT
అధికారం కంటే డబ్బే ముఖ్యం
X
ఎన్నికల్లో విజయానికి అధికారం కంటే కూడా డబ్బు ముఖ్యం. డబ్బుంటే.. అధికార పార్టీ కంటే కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయగలిగితే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ విషయం నల్లగొండ, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రుజువైంది. అందుకని.. ఎన్నికల్లో విజయం సాధించాలంటే డబ్బు ఖర్చు చేసే అభ్యర్థి ముఖ్యమని కూడా అర్థమవుతోంది.

వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కూడా ఇదే కారణం. ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోవడానికి కూడా ఇదే కారణం. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టినప్పుడే అక్కడ ఆయన గెలుపు ఖాయమైంది. అయితే, కాంగ్రెస్ లోని రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే ఆయన ఓడిపొతారేమోనని భయపడ్డారు. అయితే, స్థానికంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ మంచి పట్టు ఉంది కనుక దానికితోడు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేసి అక్కడ గెలుపొందారు. ఇక్కడ ఎంపీటీసీలను ఆకర్షించడంలో వారిని కొనుగోలు చేయడంలో అధికారపార్టీ విఫలమైంది కనక ఓడిపోయింది.

మహబూబ్ నగర్ లో జరిగింది కూడా ఇదే. అక్కడ ప్రత్యర్థి కంటే దామోదర్ రెడ్డి కాస్త ఎక్కువ ఖర్చు పెట్టడం మిగిలిన వారు కూడా సహకరించడంతో అక్కడ కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది.

నల్లగొండ - పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి ఉంది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే తొలుత అభ్యర్థి కోసం వెతుక్కొనే పరిస్థితి రాకూడదు వరంగల్ తరహాలో. గెలుపుపై విశ్వాసం లేని, గెలుపునకు కనీసం కృషి చేయని వ్యక్తులను రంగంలోకి దింపకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా నల్లగొండ తరహాలో పార్టీ మొత్తం ఏకతాటిపై ఉండాలి. అలా ఉంటే భవిష్యత్తులోనూ ఆ పార్టీ గెలుపు సాధ్యమే. లేకపోతే ఎప్పట్లా బొక్క బోర్లా పడుతూనే ఉంటుంది.