Begin typing your search above and press return to search.

కేశినేని ట్రావెల్స్ ను నాని ఎందుకు మూశారు?

By:  Tupaki Desk   |   8 April 2017 11:30 AM GMT
కేశినేని ట్రావెల్స్ ను నాని ఎందుకు మూశారు?
X
తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మైన కేశినేని ట్రావెల్స్ ఈ రోజు నుంచి క‌నిపించ‌దు. అధికార‌పార్టీకి చెందిన ఎంపీ ఒక‌రు త‌న వ్యాపారాన్ని మూసేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఏపీ ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ పై దౌర్జ‌న్యం చేయ‌టం.. అనంత‌రం ఆయ‌న‌కు బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన నాని.. తాజాగా త‌న ట్రావెల్స్ కంపెనీని మూసేసిన‌ట్లుగా ప్ర‌క‌టించ‌ట‌మే కాదు.. త‌న కార్యాల‌యం వ‌ద్ద‌నున్న బోర్డును తీసేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం వ్యాపార వ‌ర్గాల్లో పెను క‌ల‌క‌లానికి దారి తీసింది. ఎందుకిలా జ‌రిగింది? ట‌్రావెల్స్ బిజినెస్ లో మొన‌గాడు లాంటోడని చెప్పే కేశినేని చివ‌ర‌కు వ్యాపారాన్ని మూసేయాల్సిన ప‌రిస్థితికి ఎందుకు వ‌చ్చింది? మొన్న‌టికి మొన్న ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ పై దాడికి య‌త్నించి అడ్డంగా బుక్ అయిన నాని.. ఆ ఘ‌ట‌న జ‌రిగిన కొద్దిరోజుల‌కు వ్యాపారాన్నే మూసేస్తూ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్న‌ట్లు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికే ప్ర‌య‌త్నం చేస్తే..

కేశినేని నాని కుటుంబానికి ట్రావెల్ బ‌స్సుల వ్యాపారానికి మ‌ధ్య అనుబంధం నిన్న‌.. మొన్న‌టిది కాదు. దాదాపు 90 ఏళ్ల నుంచి న‌డుస్తున్న‌ది. నాని తాత విజ‌య‌వాడ నుంచి మ‌చిలీప‌ట్నానికి బ‌స్సు న‌డిపారు. ఏపీలో ఇదే తొలి బ‌స్సు స‌ర్వీసుగా చెబుతుంటారు. అంత‌టి ఘ‌న చ‌రిత్ర ఉన్న కేశినేని ఈ రోజునుంచి మూసివేయ‌ట‌మే కాదు.. ప‌లు కార్యాల‌యాల్లో బోర్డుల్ని తొల‌గించ‌టం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలుకూడా కేశినేని ట్రావెల్స్ మూసివేత‌కు కార‌ణంగా చెబుతున్నారు. ఒక‌ప్పుడు కేశినేని ట్రావెల్స్ తిరుగులేని అధిప‌త్యాన్ని చెలాయించేది. త‌ర్వాత కాలంలో పెరిగిన పోటీ.. కొత్త కొత్త‌గా వ‌చ్చిన ట్రావెల్ కంపెనీల కార‌ణంగా వ్యాపార‌ప‌రంగా కేశినేని నాని ఇబ్బందుల‌కు గురవుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

అధికార‌పార్టీ ఎంపీగా ఉన్న ఆయ‌న‌.. త‌న వ్యాపారాన్ని పెంచుకోవ‌టానికి.. మిగిలిన ట్రావెల్ కంపెనీల్ని దెబ్బ తీసేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఎదురుదెబ్బ తీయ‌టం.. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గిలిన‌ట్లుగా తెలుస్తోంది. ఇత‌ర‌రాష్ట్రాల్లో రిజిస్ట్రేష‌న్లు చేయించిన బ‌స్సుల్ని న‌డ‌ప‌టం ద్వారా.. పోటీ ట్రావెల్ కంపెనీల‌తోస‌మానంగా నాని సంస్థ పోటీ ప‌డ‌లేక‌పోయింద‌ని.. ఇందులో భాగంగానే వారిని దెబ్బ తీసేందుకు త‌న‌కున్న ప‌వ‌ర్ ను ర‌వాణా క‌మిష‌న‌ర్ వ‌ద్ద ప్ర‌ద‌ర్శించ‌టం.. ఆయ‌న ఎంత‌కూ నాని ఒత్తిడికి త‌లొగ్గ‌క‌పోవ‌టంతో కాస్తంత దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా త‌న దారికి తెచ్చుకోవాల‌న్న ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో వ్య‌వ‌హారం బూమ‌రాంగ్ కావ‌టం.. మీడియా కార‌ణంగా ఇష్యూ ర‌చ్చ ర‌చ్చగా మారింది.

ఇదే నాని ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింద‌ని చెప్పాలి. త‌న పార్టీకి చెందిన విజ‌య‌వాడ ఎమ్మెల్యే బొండా ఉమ‌ను తీసుకొని.. ర‌వాణా క‌మిష‌న‌ర్ పై గొడ‌వ‌కు వెళ్లిన వ్య‌వహారం.. అంత‌కంత‌కూ ముదిరి.. చివ‌ర‌కు ఏపీ స‌ర్కారు నెత్తికి చుట్టుకుంది. దాన్నించి బ‌య‌ట‌ప‌డేందుకు.. ర‌వాణా క‌మిష‌న‌ర్ కు భేష‌ర‌తు క్ష‌మాప‌ణ చెప్పాలంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్ప‌ష్టంగా చెప్ప‌టంతో.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో సారీ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ మొత్తం ర‌చ్చ‌తో.. ర‌వాణా శాఖ అధికారుల దెబ్బ‌కు నాని ఇబ్బందికి గురి కావ‌టం.. నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రిస్తే వ్యాపారం చేయ‌లేని ప‌రిస్థితి ఉండ‌టం.. ఇప్ప‌టికే డ‌ల్ గా ఉన్న వ్యాపారానికి తాజా గొడ‌వ మ‌రింత ఇబ్బందిక‌రంగా మార‌టంతో.. మ‌రిన్ని న‌ష్టాలుమూట‌గ‌ట్టుకునే క‌న్నా.. బోర్డు పీకేయ‌టం మంచిద‌న్న ఆలోచ‌న‌లోకేశినేని వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఏమైనా.. అధికార‌ప‌క్షానికి చెందిన ఎంపీ ఒక‌రు.. త‌న వ్యాపారాన్ని నిలిపివేయ‌టం అటురాజ‌కీయ‌.. వ్యాపార రంగాల్లో సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్పాలి. ఈ వ్య‌వ‌హారంపై ఒక బ‌స్సు కంపెనీ య‌జ‌మాని ప్రైవేటుగా మాట్లాడుతూ.. అంద‌రిని దెబ్బేయాల‌న్న ఆలోచ‌న చేసిన నాని చివ‌ర‌కు త‌న‌కుతానే దెబ్బ తిన్నాడ‌న్న మాట‌ను చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఈ విష‌యాల్లో నిజానిజాల సంగ‌తి ఎలా ఉన్నా.. ఇత‌ర రాష్ట్రాల్లో రిజిస్ట్రేష‌న్ చేయించిన బ‌స్సుల్ని ఏపీలో అనుమ‌తించ‌కూడ‌ద‌న్న నాని మాట‌కుఏపీ స‌ర్కారు నో చెప్ప‌టంతో.. అధికార‌ప‌క్ష ఎంపీ.. త‌న వ్యాపారాన్ని మూసేశార‌ని చెప్పాలి. ఈ కార‌ణంగా ప‌లు రాష్ట్రాల్లోని దాదాపు 170 బ‌స్సు సేవ‌లు నిలిచిపోనున్న‌ట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/