Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎస్ గా ఏపీ ఐఏఎస్..కేసీఆర్ ఛాయిస్ ఆయనే ఎందుకంటే?

By:  Tupaki Desk   |   1 Jan 2020 1:30 AM GMT
తెలంగాణ సీఎస్ గా ఏపీ ఐఏఎస్..కేసీఆర్ ఛాయిస్ ఆయనే ఎందుకంటే?
X
నిజమేనండోయ్... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్... తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఎంతమాత్రం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ కేడర్ కే చెందిన సోమేశ్... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కేడర్ కు ఆయనను పంపారు. అయితే... తాను ఏపీకి వెళ్లలేనని, తనను తెలంగాణలోనే కొనసాగించాలని కోరిన సోమేశ్... నేరుగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించారు. సోమేశ్ అభ్యర్థనపై సానుకూలంగా ఏమీ స్పందించని ట్రిబ్యూనల్... అలాంటి ప్రతిపాదనలే మరిన్ని రావడంతో సోమేశ్ ను తెలంగాణలోనే కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. దీంతో సోమేశ్ కూడా తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ పోస్టును కూడా అందుకున్నారు.

1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సోమేశ్ గురించి చాలానే చెప్పుకోవాలి. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత ప్రీతిపాత్రమైన అధికారిగా సోమేశ్ ముద్ర వేయించుకున్నారు. ఉమ్మడి ఏపీలో పలు కీలక పోస్టుల్లో పని చేసిన సోమేశ్ కుమార్... కొత్త రాష్ట్రం తెలంగాణలోనూ కీలక పదవులను అలంకరించారు. సీఎస్ తర్వాత తెలంగాణలో కీలకమైన పోస్టు జీహెచ్ ఎంసీ కమిషనర్ పోస్టే కదా. ఈ పోస్టులో చాలా కాలం పాటు పనిచేసిన సోమేశ్... కేసీఆర్ చెప్పిందే వేదంగా అడుగులు వేశారన్న ఆరోపణలను మూటగట్టుకున్నారు. అప్పుడెప్పుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని కట్టుకున్న సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న సోమేశ్... బాబు ఇంటికి అనుమతులు ఇచ్చే విషయంలో తనదైన శైలి నిర్ణయాలతో బాబును బాగా ఇబ్బంది పెట్టారు. చిన్న చిన్న కారణాలను చూపి బాబు కొత్త ఇంటికి చాలా రోజుల పాటు అనుమతులు ఇవ్వకుండా సోమేశ్ సతాయించారన్న వాదనలూ లేకపోలేదు.

కేసీఆర్ ఆదేశాల మేరకే నాడు ఏపీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సోమేశ్ వెనుకాడలేదన్న వార్తలూ నాడు ఆసక్తి రేకెత్తించాయి. కేసీఆర్ చెప్పినట్లుగా నడవడం మినహా నిబంధనలను ఏమీ పట్టించుకోకుండా వ్యవహరించిన కారణంగానే కేసీఆర్ కు సోమేశ్ అత్యంత ప్రీతిపాత్రమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారన్న వాదనలు లేకపోలేదు. ఇక ఇప్పుడు సోమేశ్ కంటే సీనియర్ అయిన ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా ఉండగా... సీనియార్టినీ కూడా పక్కనపెట్టేసిన కేసీఆర్... తనకు అనుకూలంగా ఉంటారన్న భావనతోనే సోమేశ్ కు సీఎస్ పోస్టును కట్టబెట్టినట్టుగానూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ కేడర్ కు చెందిన సోమేశ్ ను తెలంగాణ సీఎస్ గా నియమించిన వెంటనే... నాడు చంద్రబాబును సోమేశ్ పెట్టిన ఇబ్బందే గుర్తుకు వచ్చిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.