Begin typing your search above and press return to search.

కేసీఆర్, మోడీకి చెడింది ఇక్కడే..

By:  Tupaki Desk   |   4 July 2019 3:16 PM IST
కేసీఆర్, మోడీకి చెడింది ఇక్కడే..
X
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, బీజేపీ పెద్దమనిషి మోడీ గడిచిన 2014 ప్రభుత్వ హయాంలో కలిసి పనిచేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ ఎస్ కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చింది. దానికి ప్రతిగా మోడీ ముఖ్యంగా తెలంగాణలో తమ ఉమ్మడి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే పూర్తిగా సహకరించారు. డిసెంబర్ లోనే తెలంగాణ ఎన్నికలు నిర్వహించడానికి ఒప్పుకొని కాంగ్రెస్ ను ఓడించారు. కేంద్రంలోని బీజేపీకి టీఆర్ ఎస్ బీ టీమ్ అని కాంగ్రెస్ కూడా ఆరోపించింది.

అయితే తెలంగాణలో రెండోసారి ఎన్నికయ్యాక కేసీఆర్, మోడీల మధ్య దూరం పెరిగిపోయినట్టు రాజకీయ పరిణామాలను బట్టి అర్థమవుతోంది. కేసీఆర్ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరగడం.. బీజేపీ , కాంగ్రెస్ లకు ప్రత్యామ్మాయంగా కొత్త ఫ్రంట్ కు ప్రయత్నాలు చేయడం మోడీకి కోపం తెప్పించిందని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక తెలంగాణలోనూ వేలుపెట్టి టీఆర్ ఎస్ ను ఓడించి 4 సీట్లలో బీజేపీ గెలవడం కూడా కేసీఆర్ కోపానికి కారణమైందన్న వాదన వినిపిస్తోంది. ఇవే కాక ఎన్నికల వేళ మోడీ గురించి కేసీఆర్ పరుష వ్యాఖ్యలు కూడా రెండు పార్టీల మధ్య దూరం పెంచాయన్న చర్చ సాగుతోంది.

అందుకే ఇప్పుడు రెండోసారి మోడీ గద్దెనెక్కాక టీఆర్ ఎస్ ను పూర్తిగా దూరం పెట్టారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వడం లేదు. కేంద్రమంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి, నీతి అయోగ్ సమావేశానికి కేసీఆర్ అందుకే హాజరు కాలేదన్న చర్చ సాగుతోంది.

ఈ పరిణామాలకు బలం చేకూర్చేలా మరో కీలక నిర్ణయంలో కేసీఆర్ ను మోడీ పక్కనపెట్టడం సంచలనంగా మారింది. దేశంలో వ్యవసాయ రంగ రూపురేఖలు మార్చడానికి జాతీయ స్థాయిలో విధానాన్ని రూపొందించడానికి మోడీ ప్రభుత్వం ముఖ్యమంత్రులతో ఒక కీలక కమిటీ వేసింది. అందులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తోపాటు నీతి అయోగ్ అయోగ్ మెంబర్ రమేష్ చంద్ , మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను కమిటీగా వేశారు. రెండు నెలల్లో వీరు దేశంలో రైతు గతినే మార్చేలా నిర్ణయాలు తీసుకోవాలి.

అయితే తెలంగాణ దేశానికే కాదు.. ప్రపంచానికే వ్యవసాయ రంగంలో ఆదర్శంగా ముందుకెళ్తోంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతుబంధు, రైతుబీమా, ఉచితకరెంట్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఏకంగా మోడీ కూడా తమ పథకం రైతుబంధును కాపీ కొట్టాడని కేసీఆర్ చెప్పుకొచ్చాడు. రైతు గతినే మార్చిన కేసీఆర్ ను ఈ కీలకమైన వ్యవసాయ సంస్కరణల కమిటీలో మోడీ పక్కనపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయంగా వీరిద్దరి మధ్య దూరాన్ని సూచిస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేసీఆర్ కృషిని కేంద్ర కావాలనే పక్కనపెట్టడం.. అభినందించకపోవడం.. పట్టించుకోకపోవడంపై టీఆర్ఎస్ గుర్రుగా ఉంది. దేశానికి వ్యవసాయరంగంలో విశేష అనుభవం ఉన్న స్వయానా రైతు అయిన కేసీఆర్ ను కమిటీలో వేయకపోవడంపై టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ కూడా తప్పుపట్టారు. మోడీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

దీన్ని బట్టి రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత తాజా పరిణామాలతో మోడీకి, కేసీఆర్ మధ్య గ్యాప్ చాలా పెరిగిందని అర్తమవుతోంది.