Begin typing your search above and press return to search.

కాపులకు అన్యాయం చేసింది ఆ ముగ్గురు రెడ్లే!

By:  Tupaki Desk   |   1 Feb 2016 5:26 AM GMT
కాపులకు అన్యాయం చేసింది ఆ ముగ్గురు రెడ్లే!
X
ఏపీ ఇప్పుడు ‘కులం’తో అట్టుడికిపోతోంది. కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న దశాబ్దాల డిమాండ్ పై ‘కాపు గర్జన’ అంటూ ఆదివారం తునిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ పరిణామాలు ఏ విధంగా మారాయో తెలిసిందే. కాపులు ఇంతగా రెచ్చిపోవటానికి కారణం ఏమిటి? ప్రశాంతతకు మారుపేరుగా చెప్పే గోదావరి జిల్లాల్లో ఇంత రచ్చ ఎందుకు చోటు చేసుకుంది? లాంటి ప్రశ్నలతో పాటు.. కాపులు ఇంత తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయటానికి కారణం చూసినప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

చారిత్రకంగా చోటు చేసుకున్న తప్పులు.. వాటిని వెంటనే సరిదిద్దే క్రమంలో చోటు చేసుకున్న పొరపాట్లు ఓ పెద్ద సమస్యగా మారాయి. అయితే.. కాపులకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రుల్లో ముగ్గురు ప్రముఖంగా కనిపిస్తారు. ఈ ముగ్గురు ‘‘రెడ్డి’’ సామాజిక వర్గానికి చెందిన వారు కావటం గమనార్హం. వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికి ఇది నిజం. అదెలానన్నది చరిత్రలోకి వెళ్లి చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

1910 నుంచి 1956 వరకు కాపులు బీసీల్లోనే ఉన్నారు. అయితే నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాపుల్ని ఓసీలుగా మార్చారు. అయితే.. ఈ నిర్ణయాన్ని దామోదరం సంజీవయ్య సీఎం అయ్యక 1961లో కాపుల్ని తిరిగి బీసీలుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోతే ఓ పెద్ద సామాజిక సమస్యకు అక్కడే పుల్ స్టాప్ పడేది.

కానీ.. దూరదృష్టి లేని నేతల పుణ్యమా అని 1966లో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎం అయిన వెంటనే కాపుల్ని మరోమారు ఓసీ జాబితాలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకోవటం ఆ సామాజిక వర్గంలో అసంతృప్తి చోటు చేసుకుంది. ఈ కారణంగా అప్పట్లో పెద్ద ఎత్తున కాపులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. కాపుల్ని బీసీల్లోకి చేర్చాలంటూ 1993లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిని కలిసేందుకు ప్రదర్శనగా వెళితే లాఠీ ఛార్జ్ జరిగింది. దీంతో కాపులు తీవ్రంగా రగిలిపోయారు. ఆ ఘటనకు నిరసనగా ఆమరణ నిరాహారా దీక్ష చేయటం.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటం.. కోస్తా ప్రాంతమంతా అట్టుడికిపోవటంతో.. జీవో 30ను విడుదల చేశారు. అయితే.. కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న అంశంపై శాశ్విత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయకపోవటంతో ఈ సమస్య నేటి పరిణామానికి కారణంగా మారింది.