Begin typing your search above and press return to search.

సీఎస్ పై సోదాలతో చిన్నమ్మకు చెక్..?

By:  Tupaki Desk   |   22 Dec 2016 12:13 PM IST
సీఎస్ పై సోదాలతో చిన్నమ్మకు చెక్..?
X
ఈ మధ్యన విడుదలైన ధృవ సినిమా చూశారా? అందులో హీరో పాత్ర ఒక మాట చెబుతాడు. మీరందరూ వార్తల్ని వార్తలుగా చూస్తారు. నేను మాత్రం వార్తల్లోని బిట్వీన్ లైన్ చూస్తానని చెబుతాడు. సరిగ్గా.. తమిళనాడురాజకీయ పరిస్థితి ఇంచుమించే ఇదే తరహాలో ఉందని చెప్పక తప్పదు. తెర మీద కనిపించే వార్తలకు.. తెర వెనుక జరిగే పనులకు ఏ మాత్రం పొంతన లేకుండా సాగుతున్నాయన్న సందేహాం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మొన్నామధ్య టీటీడీ బోర్డు మెంబరుగా.. తమిళనాడు అధికారపక్ష నేతలకు అత్యంత సన్నిహితుడైన శేఖర్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలు సైతం.. భారీ ప్లాన్ లో భాగంగానే సాగిందన్న మాట వినిపిస్తోంది. అమ్మ మరణంతో అధికార దండాన్ని చేతబూనిన పన్నీరుసెల్వం పార్టీలో తన హవా నిలుపుకునేందుకు కొత్త ఎత్తుల్ని వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అమ్మ తర్వాత ఆమె నిర్వహించిన ముఖ్యమంత్రి పదవిని పన్నీరు సెల్వానికి అప్పగించటంలో చిన్నమ్మ కీ రోల్ ప్లే చేసినప్పటికీ.. ఆ పదవిపై తనకు ఆశలు ఉన్నాయన్న విషయాన్ని తన చేష్టలతో అర్థమయ్యేలా చేస్తున్న ఆమెకు చెక్ చెప్పేందుకు పన్నీరుసెల్వం టీం ఊహించని రీతిలో స్టెప్పులు వేస్తుందన్న మాట వినిపిస్తోంది.

శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన వేళ.. ఆయన దగ్గర లభ్యమైన పత్రాల్లో తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు పేరుతో సహా..ఏపీలోని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ మరిది బద్రీ నారాయణ (ఆయన సీఎస్ వియ్యంకుడు) ఇంట్లోనూ సోదాలు నిర్వహించటం గమనార్హం. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. శశికళ సీఎం పదవి మీద ఆశను బయటపెట్టిన తర్వాత తనిఖీల కార్యక్రమం షురూ అయినట్లు కనిపించక మానదు. మరీ ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని మోడీతో భేటీ అయి వచ్చాకే.. సీఎస్ ఇంటి పైనా.. ఆఫీసుపైనా సోదాలు జరగటం వెనుక ఏదో లెక్క ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యమంత్రి పదవిని గురిపెట్టిన చిన్నమ్మకు చుక్కలు చూపించే కార్యక్రమం మొదలు పెట్టటంతో పాటు.. ఆమె పాత్రను పరిమితం చేయటం.. ఆమెపై కూడా కేసుల మరకలు అంటించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లుగా చెబుతున్నారు. మరీ అంచనాలు ఎంతవరకూ నిజమన్నది.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే అంశాలు స్పష్టం చేస్తాయని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/